Iran war global arms race: ఇరాన్‌పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు యుద్ధం నుంచి బయటపడేందుకు తంటాలు పడుతోంది. నెల రోజులు దాటినా ఇరాన్ అమెరికా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మరోవైపు అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికానూ ఆర్థికంగా దెబ్బకొడుతోంది. యుద్ధ విమానాలను కూలుస్తోంది. ఇరాన్‌ను అణుశక్తిగా మారకుండా అడ్డుకోవాలన్న అమెరికా–ఇజ్రాయెల్ వ్యూహం ప్రతికూల పరిణామాలకు దారితీసింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో చేసే ప్రతిదాడులకు అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇరాన్ రూ.20 వేల నుంచి రూ.50 వేల ఖర్చుతో తయారుచేసిన షాహెద్ డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికాు1.5 నుంచి 4 మిలియన్ల డాలర్ల విలువైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను వాడుతోంది. 12 రోజుల యుద్ధంలో అమెరికాకు వేల కోట్ల రూపాయల విలువైన సైనిక సంపత్తి నష్టపోయింది. ఖతార్‌లోని 500 మిలియన్ల డాలర్ల విలువైన రాడార్ వ్యవస్థ, జోర్డాన్, సౌదీ అరేబియాలోని థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. రోజుకు సుమారు ఒక బిలియన్ డాలర్ల ఖర్చుతో యుద్ధం సాగుతోంది. ఇంత ఖర్చు భరించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. గల్ఫ్ మిత్రదేశాలకు రక్షణ కల్పించడంలో అమెరికా వైఫల్యం చెందిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ‘అమెరికాపై ఆధారపడటం ప్రమాదకరం‘ అనే నిర్ణయానికి నెడుతున్నాయి.
కొత్త అణు పోటీలో ఆరు దేశాలు..
అమెరికా భద్రతా హామీలపై నమ్మకం సడలడంతో, పలు దేశాలు సొంత అణు రక్షణ కవచం, లేదా అణ్వాయుధాల సముపార్జనపై దృష్టి సారించాయి. ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం తగ్గడం ఈ ధోరణికి కారణం. సౌదీ అరేబియా, టర్కీ, దక్షిణ కొరియా, జపాన్, పోలాండ్ అణ్వస్త్రాల తయారీపై దృష్టి పెట్టాయి. రష్యా, చైనా తమ అణు ఆయుధాలను ఆధునీకరించుకోవడం కూడా ఈ పోటీకి ఊతమిస్తోంది.
చరిత్ర గుణపాఠం..
ఒకప్పుడు అణు నిరాయుధీకరణను స్వాగతించిన దేశాలు, ఇప్పుడు ఆ నిర్ణయాలను పశ్చాత్తాపంతో చూస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ కూలినప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తిగా ఉంది(1,900 వ్యూహాత్మక వార్హెడ్లు, 176 ఖండాంతర క్షిపణులు). 1994 బుడాపెస్ట్ ఒప్పందం ప్రకారం, భద్రతా హామీలకు బదులుగా అణు ఆయుధాలను రష్యాకు అప్పగించింది. కానీ 2014లో క్రిమియాను, 2022లో పూర్తిస్థాయి యుద్ధాన్ని ఎదుర్కొంది. ‘అణు ఆయుధాలు ఉండి ఉంటే రష్యా దాడి చేసేది కాదు’ అనే అభిప్రాయం ఉక్రెయిన్‌లో బలంగా ఉంది. 1980లలో దక్షిణాఫ్రికా సొంతంగా ఆరు అణు బాంబులు తయారు చేసింది. 1990లలో వాటిని స్వచ్ఛందంగా ధ్వంసం చేసుకుంది. ఇజ్రాయెల్‌కు సాంకేతిక సహాయం అందించింది. ఇప్పుడు ప్రాంతీయ అస్థిరత నేపథ్యంలో ఆ నిర్ణయంపై చర్చ జరుగుతోంది. సోవియట్ వారసత్వంగా వచ్చిన అణు ఆయుధాలను బెలారస్, కజకిస్తాన్ రష్యాకు అప్పగించి ఎన్పీటీలో చేరాయి. ఇప్పుడు రష్యా ప్రభావంలో ఉండటం వల్ల స్వంత నియంత్రణ లేకపోవడం బలహీనతగా మారింది.
అణు బాంబు ఉంటే ప్రపంచ చిత్రపటం మారుతుంది
ఇరాన్ అధికారికంగా అణు ఆయుధాలు కలిగి ఉన్నట్లు ప్రకటించలేదు. కానీ దాని యురేనియం శుద్ధి కార్యక్రమం (నతాంజ్, ఫోర్డో కేంద్రాలు), క్షిపణి సామర్థ్యం, అమెరికా–ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణు ఆశయాలను వదులుకోకపోవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. 12 రోజుల యుద్ధం ఇరాన్‌ను మరింత ఏకాంతంలోకి నెట్టింది. దాని ప్రాక్సీలు బలహీనపడ్డాయి. ఈ పరిస్థితిలో, ఉత్తర కొరియా లాగా అణు ఆయుధం సాధించడమే మనుగడకు మార్గమని ఇరాన్ భావించవచ్చు. ఒకవేళ ఇరాన్ అణుబాంబును సాధిస్తే, మధ్యప్రాచ్యంలో కొత్త అణు పోటీ మొదలవుతుంది. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు తమ వైఖరిని మార్చుకోవాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ ఒక్కటే అణుశక్తిగా ఉన్న ప్రస్తుత పరిస్థితి మారి, ప్రాంతం అణు యుద్ధం అంచునకు చేరుకుంటుంది.