China role in Iran US ceasefire: సుమారు 40 రోజులపాటు సాగిన పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.. యుద్ధం మొదలు పెట్టిన డొనాల్డ్ ట్రంప్. నల్లేరు మీద నడక అనుకుని మొదలు పెట్టిన యుద్ధం అగ్రరాజ్యం అంచనాలను తలకిందులు చేసింది. ఇరాన్ అమెరికా దాడులును ఎదుర్కొనడంతోపాటు ప్రతీకార దాడులతో అమెరికా అనుకూల దేశాలను తీవ్రంగా దెబ్బకొట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతోంది. దీంతో ట్రంప్ దిగిరాక తప్పలేదు. ఈ క్రమంలో తత్వం బోధపడిన ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటించారు. అయితే అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ వెనుక అసలు చక్రం తిప్పింది చైనా అని అంతర్జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఇరాన్‌ను బీజింగ్ ఒప్పించి, చర్చలకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. తుర్కియే, పాకిస్తాన్, గల్ఫ్ దేశాలతో సమన్వయం చేసుకుంటూ ఈ డీల్‌ను సెట్ చేయడంలో చైనా విజయం సాధించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పరోక్షంగా ధ్రువీకరించారు.
ఇరాన్–చైనా వ్యూహాత్మక భాగస్వామ్యం..
ఇరాన్–చైనా మధ్య నెలకొన్న గాఢమైన ఆర్థిక బంధమే ఈ మధ్యవర్తిత్వానికి మూలకారణం. ఇరాన్ నుంచి చైనా రోజుకు 15 లక్షల బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటుంది. నెలకు 1.5 మిలియన్ డాలర్ల చొపుపన ఏడాదికి 18 మిలియన్ డాలర్ల చమురు దిగుమతి చేసుకుంటుంది. అయితే డబ్బులు డాలర్లలో చెల్లించకుండా యువాన్ కరెన్సీలో చెల్లిస్తోంది. 2023లో తొలి 9 నెలల్లో 10 బిలియన్ డాలర్లు చైనాకు ఆదా అయింది. ఇక ఇరాన్ కూడా తన చమురు ఉత్పత్తిలో 80 శాతం చైనాకే విక్రయిస్తోంది. అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి మలేషియా చమురుగా తప్పుడు పత్రాలతో సరఫరా చేస్తోంది. ఈ ‘ఆయిల్ ఫర్ యువాన్‘ విధానం అమెరికా డాలర్ ఆధిపత్యానికి సవాలుగా మారింది.
చైనా వ్యూహం వెనుక మూడు లక్ష్యాలు..
ఇరాన్–అమెరికా మధ్య సీజ్‌ఫైర్ ఒప్పించడం వెనుక చైనాకు మూడు లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది తన ఇంధన భద్రతను కాపాడుకోవడం, రెండోది డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకోవడం, మూడోది మధ్య ప్రాశ్చంలో పట్టు పెంచుకోవడం. చైనా మొత్తం ఇంధన అవసరాల్లో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంపై భారీగా ఆధారపడి ఉంది ఖతార్ నుంచి చైనా దిగుమతుల్లో 30 శాతం సరఫరా అవుతోంది. హార్మూజ్ జలసంధి మూసుకుపోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ జలమార్గాన్ని తెరిచి ఉంచడం చైనాకు అత్యవసరం. ఇక ఇరాన్ చమురును యువాన్‌లో కొనడం ద్వారా చైనా ‘డాలర్ రహిత సామ్రాజ్యాన్ని‘ నిర్మిస్తోంది. బ్యాంక్ ఆఫ్ కున్లున్ ద్వారా సాగుతున్న ఈ లావాదేవీలు అమెరికా ఆర్థిక ఆంక్షలను దెబ్బతీస్తున్నాయి. యుద్ధం కొనసాగితే ఈ యువాన్ వ్యాపారం దెబ్బతింటుంది. పాకిస్తాన్, తుర్కియే, గల్ఫ్ దేశాలతో సమన్వయం చేసుకుని చైనా తన దౌత్యపరమైన శక్తిని ప్రదర్శించింది. అమెరికా సైనిక శక్తిపై ఆధారపడకుండా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని చాటుకుంది.
చైనా పాత్రను ధ్రువీకరించిన ట్రంప్..
ఈ కాల్పుల విరమణ ప్రకటన సందర్భంగా ట్రంప్, ‘మిత్రదేశాల సహకారంతో ఈ ఒప్పందం సాధ్యమైంది’ అని పరోక్షంగా చైనా పాత్రను ధ్రువీకరించారు. అమెరికాకు కూడా యుద్ధం కొనసాగించడం ఆర్థికంగా భారంగా మారింది. చమురు ధరలు 110 డాలర్లు దాటడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేశాయి.
అంతిమ లబ్ధి చైనాకేనా?
ఇరాన్–అమెరికా సీజ్‌ఫైర్‌తో ప్రపంచ మార్కెట్లు కోలుకుంటున్నాయి. చమురు ధర 100 డాలర్ల దిగువకు తగ్గింది. అయితే అంతిమ లాభం మాత్రం చైనాకే ఎక్కువ. ఇంధన భద్రత పెరుగుతుంది. యువాన్ వ్యాపారం సురక్షితంగా ఉంటుంది. మధ్య ప్రాశ్చంలో చైనా ప్రబల్యం పెరుగుతుంది. అమెరికా ప్రభావం తగ్గుతుంది. ఇక యుద్ధం కొనసాగితే అమెరికాలో ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి. చమురు ధరల పెరుగుదల ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రజావ్యతిరేకత పెరుగుతుంది. మొత్తానికి చైనా దౌత్య వ్యూహం ముందు అమెరికా సైనిక వ్యూహం తేలిపోయింది.
ఈ సీజ్‌ఫైర్ కేవలం యుద్ధ విరామం కాదు.. చైనా తన ఆర్థిక, దౌత్యపరమైన శక్తిని ప్రదర్శించిన మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.