Mexico pyramid : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అదిగో పులి అంటే.. ఇదిగో తోక అనే వాదనలు పెరిగిపోయాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ.. చర్చ మాత్రం జోరుగా సాగుతూ ఉంటుంది. గతంలో ఎన్నో సంఘటనలకు సంబంధించి సోషల్ మీడియా అనేక చర్చలకు వేదికయింది. అయితే ఈ చర్చలో వాస్తవాల కంటే ఊహాగానాలకే ప్రాధాన్యం ఎక్కువ లభించింది. ఫలితంగా అవన్నీ ఉబుసు పోని కబుర్లయ్యాయి. అప్పట్లో యుగాంతం తప్పదని ఓ సినిమా కూడా అదే పేరుతో విడుదలైంది. ఆ తర్వాత ఆ సినిమా మేకర్స్ చెప్పినట్టు యుగాంతం సంభవించలేదు. అయితే అప్పట్లో యుగాంతం పై చర్చాతి చర్చలు జరిగాయి. ఆ సినిమా వచ్చి కూడా దశాబ్దం దాటిపోయింది. ఆ తర్వాత యుగాంతం గురించి అనేక చర్చలు జరిగినప్పటికీ.. అవన్నీ గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతను నిజం చేసి చూపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఎందుకు ఆ చర్చ అంటే.. అక్కడదాకే వస్తున్నాం. సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వార్త యుగాంతం సంభవిస్తుందనే దానికి బలం చేకూర్చుతోంది.
మెక్సికోలో ఇటీవల తీవ్రమైన తుఫాన్ సంభవించింది. ఈ తుఫాన్ వల్ల పురాతనమైన యకాటా పిరమిడ్ కుప్పకూలిపోయింది. మెకొవాకన్ రాష్ట్రంలో ఈ పురాతన పిరమిడ్లు ఉన్నాయి. ఈ పిరమిడ్లను తమ పూర్వీకుల జ్ఞాపకార్థం పురెపెచ్చా జాతి ప్రజలు నిర్మించుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే అక్కడి ప్రజలు ఈ సంస్కృతిని పాటిస్తున్నారు. పిరమిడ్ నిర్మించే క్రమంలో మనుషులను బలి ఇచ్చేవారట.. పిరమిడ్ నిర్మాణంలోనూ విభిన్న శైలిని అనుసరించే వారట. డంగు సున్నం, బలమైన రాళ్లు, ఇసుక, బంక మట్టి మిశ్రమంతో పిరమిడ్లను నిర్మించేవారు. ఆ పిరమిడ్లను కూడా ఆ వ్యక్తుల జీవనశైలి, సమాజంలో గుర్తింపు, ఇతర అంశాల ఆధారంగా నిర్మించేవారు. అందుకే ఎత్తులలో తారతమ్యాలు కనిపిస్తాయి. వందల ఏళ్ల క్రితం నుంచి ఇలా పిరమిడ్లు నిర్మిస్తున్నప్పటికీ.. ఇంతవరకు అవి చెక్కుచెదరలేదు. పైగా ప్రకృతి విపత్తుల సంభవించినప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయి. అయితే ఇటీవల మెక్సికోలో తీవ్రమైన తుఫాన్ సంభవించింది. ముఖ్యంగా మెకో వాకాన్ రాష్ట్రంలో తుఫాన్ అతలాకుతలం చేసింది. దీంతో యకాటా పిరమిడ్ సముదాయంలో ఒక్కటి కుప్ప కూలింది.
ఈ పిరమిడ్ కుప్పకూలిపోవడంతో పురెపెచ్చా జాతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దృఢంగా, బలంగా ఉన్న పిరమిడ్ కుప్పకూలిపోయిందంటే ప్రపంచానికి ఏదో పెద్ద విపత్తు రాబోతుందని వారు భయపడుతున్నారు. ” కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ పిరమిడ్లు ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకున్నాయి. మలమలా మాడ్చిన ఎండలు, నిండా ముంచిన వానలు, వణికించిన చలి గాలులు.. ఇలాంటి వాతావరణంలో కూడా అవి మన గలిగాయి. కానీ తుఫాన్ వల్ల కూలిపోయాయి. దీనిని ప్రమాదం అని కొట్టి పారేయలేం. ఇది భారీ విపత్తు. ప్రపంచానికి ఏదో కీడు శంకించి ఉంది. దీనివల్ల యుగాంతం సంభవిస్తుందనే అనుమానం కలుగుతోందని” పురెపెచ్చా జాతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కూలిపోయిన పిరమిడ్ కు మరమ్మతులు చేసి, పునరుద్ధరిస్తామని మెక్సికో పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కూలిపోయిన పిరమిడ్ ను వారు పరిశీలించారు. ఆ పిరమిడ్ ఎత్తు, వెడల్పును కొలతలు తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని వారు వెల్లడించారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More