Bangladesh crisis : ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసినప్పటికీ.. బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. హింస అంతకంతకు పెరిగిపోతోంది.. ఎప్పుడు ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అని తేడా లేకుండా ఆందోళనకారులు ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు.. వాహనాలకు నిప్పు పెడుతున్నారు.. క్రికెటర్ల ఇళ్లను దోచుకుంటున్నారు. చివరికి ప్రధానమంత్రి అధికారిక నివాసంలోనూ ప్రవేశించి ఆగమాగం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చివరికి బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా లో దుస్తులను చేతులతో పట్టుకొని ఆందోళనకారులు అటూ ఇటూ తిప్పడం కలవరానికి గురి చేస్తోంది. అయితే షేక్ హసీనా గుండెపగిలే వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఇది నిజమే అని బంగ్లాదేశ్ మీడియా కూడా నిర్ధారించడంతో నిర్ఘాంత పోవడం అవామీ లీగ్ పార్టీ నాయకుల వంతవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
దారుణంగా చంపేశారు
బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లలో ఓ యువ నటుడు, అతడి తండ్రిని కొంతమంది దారుణంగా హతమార్చారు. ఆ యువ నటుడు గతంలో మాజీ ప్రధానమంత్రి హసీనా జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో నటించాడు. అవామీ లీగ్ మద్దతు దారులను లక్ష్యంగా చేసుకొని ఆందోళనకారులు బంగ్లాదేశ్లో హింసకాండ కు పాల్పడ్డాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆందోళనకారులు పూర్తిస్థాయిలో హింసా మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో షేక్ హసీనా తన ప్రధాని పీఠం నుంచి దిగిపోవలసి వచ్చింది. దేశాన్ని కూడా వీడాల్సి వచ్చింది. ఆమె రాజీనామా చేసిన అనంతరం ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ యువ నటుడు, దర్శకుడైన అతడి తండ్రిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ జీవిత కథ లో నటించాడు.
షేక్ హసీనా తండ్రి బయోపిక్ లో నటించడమే కారణం
ముజీబుర్ జీవిత కథ ఆధారంగా బంగ్లాదేశ్ కు చెందిన దర్శకనిర్మాత సలీం ఖాన్ 2021లో “తుంగి పరార్ మియా భాయ్” అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో సలీం కుమారుడు, నటుడు శాంతో ఖాన్ హసీనా తండ్రీ రెహమాన్ యుక్త వయసు పాత్రను పోషించాడు. ఈ సినిమా ద్వారా శాంతో ఖాన్ కెరియర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ ప్రజలు విశేషంగా ఆదరించారు.
అయితే సోమవారం హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఈ వార్త బయటకు రాగానే ఆందోళనకారులు శాంతో, సలీం ను టార్గెట్ చేసుకొని దాడులు చేశారు. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న శాంతో, సలీం చాంద్ పూర్ లోని తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారు వెళుతుండగా మార్గమధ్యలో ఆందోళనకారులు అడ్డగించారు. ఆత్మ రక్షణ కోసం శాంతో, సలీం కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే నిరసనకారులు వారిపై కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో చనిపోయారు.
చనిపోయిన సలీం ఖాన్ కు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తోను సంబంధం ఉంది. వెస్ట్ బెంగాల్ లోని టాలీవుడ్ లో సలీం ఖాన్ అనేక చిత్రాలు ప్రొడ్యూస్ చేశాడు. శాంతో కొన్ని బెంగాలీ సినిమాలను నటించాడు. భారతీయ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. సలీం ఖాన్, శాంతో మృతి గురించి తెలియగానే బెంగాల్ రాష్ట్రానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా సలీం ఖాన్ బంగ్లాదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవారు. షేక్ హసీనా, ఆమె పార్టీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఢాకా లోని ప్రముఖ బంగ్లా జానపద గాయకుడు రాహుల్ ఆనందో ఇంట్లోకి ఆందోళనకారులు ప్రవేశించారు. అతడి ఇంటికి నిప్పు పెట్టారు. రాహుల్ కుటుంబ సభ్యులు అక్కడ నుంచి పారిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ సరిహద్దులోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సాంస్కృతిక హక్కుల కార్యకర్త గా కూడా రాహుల్ పనిచేస్తున్నారు. అతడు ఉంటున్న నివాసం అత్యంత పురాతనమైనది. ఆ ఇంటికి 140 సంవత్సరాల చరిత్ర ఉంది. దానిని అతడు కల్చరల్ హబ్ గా మార్చాడు. అందులో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాడు. గత ఏడాది సెప్టెంబర్లో ప్రాన్స్ అధ్యక్షుడు బంగ్లాదేశ్లో పర్యటించాడు. ఆ సమయంలో రాహుల్ నివాసాన్ని ఆయన సందర్శించారు. రాహుల్ ఇంట్లో దాదాపు 3,000 వాయిద్య పరికరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాహుల్ స్వయంగా డిజైన్ చేశాడు. ఆ ఇంటికి నిప్పు పెట్టడంతో అవన్నీ కాలిపోయాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More