Afghanistan Pakistan War: ఆఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. ఇరుదేశాల మధ్య వారాంత యుద్ధం కేవలం ఒక విరామం మాత్రమేనని, పరిస్థితి మళ్లీ తారాస్థాయికి చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరుస భూకంపాలు చైనా, పాకిస్తాన్ ప్రాంతాల్లో నమోదవుతుండటంతో అణు పరీక్షల అనుమానాలు మరింతగా వెల్లువెత్తాయి.
భూప్రకంపనలు వెనుక అణు పరీక్షలు..
వారం రోజులుగా పాకిస్తాన్, చైనా, ఆఫ్గానిస్తాన్‌లో భూకంపాలు సంభవిస్తున్నాయి. వరుస ప్రకంపనలతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్, చైనా అణు పరీక్షలు చేస్తున్నాయని ప్రకటించారు. తాము కూడా పరీక్షల చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భూకంపాలు చైనా, పాకిస్తాన్ అణుపరీక్షల కారణంగానే వస్తున్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గిల్గిట్–బాల్టిస్థాన్ ప్రాంతం నుంచి భూకంపాలు ఒకే రేఖలో సంభవించడం శాస్త్రవేత్తలను సందేహంలోకి నెట్టింది. సీఈపీఐసీ పరిధిలో చైనా సహకారంతో పాకిస్తాన్ నిర్వహిస్తున్న రహస్య ఆక్టివిటీలు గతంలోనూ అనుమానాల మేఘాలను సృష్టించాయి.
కాల్పుల విరమణపై సస్పెన్స్..
ఇక ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. తాలిబాన్ ప్రభుత్వం డ్యూరాండ్ లైన్‌ను మళ్లీ సవాలు చేయరాదని, సరిహద్దులు మూసుకుపోవాలనే డిమాండ్ చేస్తోంది. టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో వచ్చిన రెండు విరమణల తర్వాత ఇప్పుడు మూడవ సారి చర్చలు సస్పెన్స్‌లో ఉన్నాయి. ఇస్లామాబాద్ ఇక సహనం కోల్పోతున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
ససేమిరా అంటున్న తాలిబాన్..
ఆఫ్గాన్ తాలిబాన్ పక్షం పాకిస్తాన్ డిమాండ్లు అంగీకరించే స్థితిలో లేనని స్పష్టం చేసింది. సరిహద్దు దాటే ఉగ్రచర్యలకు మేము బాధ్యత వహించాలంటే, కశ్మీర్ దాడులకు పాకిస్తానే సమాధానం చెప్పాలి కదా అన్న పద్ధతిలో నిలదీయడం ఉద్రిక్తతను పెంచింది. ఇలాంటి ప్రతిస్పందన పాకిస్తాన్ సన్నద్ధతను మరింత కఠిన దిశకు మళ్ళించవచ్చని రక్షణ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
దక్షిణాసియా సరిహద్దుల్లో పెరుగుతున్న ఈ అస్పష్టత ప్రాంతీయ శాంతికి ప్రమాద సూచిక. చైనా నిశ్శబ్ద సహకారం, పాకిస్తాన్ సైనిక దూకుడు, తాలిబాన్ అప్రతీక్ష ధోరణి భవిష్యత్తులో పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ భద్రతా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.