Bandi Sanjay: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. నవంబర్ 9 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. 11వ తేదీన పోలింగ్ జరుగుతోంది. దీంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇన్ని రోజులుగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో డామినేషన్ కనిపించింది. కానీ, కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బీజేపీ రేసులోకి వచ్చింది. బోరబండలో నిర్వహించిన రోడ్‌షోలో బండి సంజయ్ సంచలన బాంబులు పేల్చారు. రోడ్‌షోకు పోలీసులు మొదట అనుమతి నిరాకరించడంతో పరిస్థితి ఆసక్తికర మలుపు తిరిగింది. దాంతో తాను చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకున్నందుకు ఆధారాలతోపాటు వీడియోలు, పత్రాలు విడుదల చేస్తూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఒత్తిడికి, మీడియా దృష్టికి రావడంతో చివరికు అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చింది.
కేటీఆర్‌పై సంచలన ఆరోపణ..
రోడ్‌షోలో బండి సంజయ్ మాట్లాడుతూ ముందుగా బీఆర్‌ఎస్ వర్గింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్‌చేశారు. మాగంటి గోపానాథ్ కుటుంబ అంతర్గత కలహాలకు మంత్రి కేటీఆర్ కారణమని సంచలన ఆరోపణ చేశారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయంగా వాడుకుంటూ బీఆర్‌ఎస్ నాయకత్వం విభేదాలను పెంచుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
సీఎంనూ వదలలేదు..
ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డిని కూడా బండి వదలలేదు. ప్రచారంలో సీఎం టోపీ ధరించడం కొత్త చర్చకు తెరతీసింది. ‘‘మత సామరస్యం పేరిట ఒక వర్గానికి మాత్రమే నతమస్తకమవడం ఎందుకు?’’ అనే ప్రశ్నలతో సంజయ్ నిలదీశారు. హిందూ నాయకులు ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పాల్గొనే ఉదారత కనబరుస్తారని, అయితే ప్రతిపక్ష మత వర్గాలు అదే గౌరవం హిందుత్వానికి ఇవ్వడం లేదని విమర్శించారు. అసదుద్దీన్‌తో హిందూ స్తోత్రం చేయిస్తారా.. పూజలు నిర్వహించేలా చేస్తారా అని నిలదీశారు.
హిందువుల ఐక్యతకు పిలుపు..
జూబ్లీహిల్స్ ప్రాంతంలో హిందువులు 70 శాతం హిందువులు ఉన్నారని, 30 శాతం ముస్లింలు ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. ముస్లింలు అంతా ఒక్కటైనప్పుడు హిందువులు ఎందుకు ఏకం కావొద్దని ప్రశ్నించారు. ఇప్పటికైనా హిందువులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మత ఆధార రాజకీయాన్ని ప్రోత్సహిస్తోందని, దానికి ప్రతిగా హిందూ ఓటర్లు ఐక్యంగా స్పందించాల్సిన సమయం ఇదేనని వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ప్రచారం ద్వారా బండి సంజయ్ మరోసారి తన యుద్ధశైలి రాజకీయాన్ని స్పష్టంచేశారు. అనుమతి సమస్యను పబ్లిక్ ఫోరమ్‌గా మలచడం ద్వారా ‘సిస్టమ్ తనను అడ్డుకుంటుందనే‘ మైండ్‌సెట్‌ను బలపరిచారు. కేటీఆర్, రేవంత్‌పై వరుస దాడులు ఆయన కొత్త వ్యూహానికి సంకేతం. ఈ ఉపఎన్నిక బీజేపీకి స్థానిక ప్రాధాన్యం మాత్రమే కాక, హిందుత్వ ఆధారిత వోటు సమీకరణ పరీక్షగా కూడా మారింది.