Bangladesh : ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి చోటు చేసుకున్న వివాదం బంగ్లాదేశ్ లో అగ్గి రాజేసింది. అది ప్రస్తుతం రావణ కాష్టం లాగా మండుతూనే ఉంది. దీంతో ఆ దేశంలో అల్లర్లు తారా స్థాయికి చేరుకున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా కట్టుతప్పాయి. దోపిడీలు, లూటీలు, అత్యాచారాలు సర్వసాధారణమైపోయాయి. ఆర్మీ చేతుల్లోకి పరిపాలన వెళ్లిన నేపథ్యంలో.. అక్కడ సాధారణ కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్షణంలో ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదని వాపోతున్నారు. ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించడం, సెల్ ఫోన్ సిగ్నల్స్ అందకుండా చేయడంతో అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియడం లేదు. దీంతో బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికీ బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్ లోనే ఉన్నారు. ఆమె శరణార్థిగా ఇంగ్లాండ్ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అది ఇంకా ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు.
బంగ్లాదేశ్లో చోటుచేసుకుంటున్న అల్లర్ల వల్ల ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు అజ్ఞాతవాకి వెళ్లిపోయారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు. అయితే వారి ఇళ్లను కూడా ఆందోళనకారులు లూటీ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన క్రికెటర్లు మొత్తం రాజధాని దాకా, చిట్టగాంగ్ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. స్వాతంత్ర ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ల పెంపును నిరసిస్తూ ఆందోళనకారులు గత కొద్దిరోజులుగా బంగ్లాదేశ్లో నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలు బంగ్లా రాజధాని ఢాకా కేంద్రంగా ఎక్కువగా సాగుతున్నాయి. అయితే రాజధాని లోనే ఎక్కువగా బంగ్లా క్రికెటర్ల నివాసాలు ఉన్నాయి. దీంతో ఆందోళనకారులు క్రికెటర్ల ఇళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. అందులోకి ప్రవేశించి పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఆయుధాలను చేతులు పట్టుకొని భయానక పరిస్థితిని కల్పిస్తున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. దుకాణాలను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. ప్రైవేట్ బిల్డింగ్ లను నాశనం చేస్తున్నారు. క్రికెటర్ల ఇళ్లు మాత్రమే కాదు, సామాన్యుల గృహాలను కూడా ఆందోళనకారులు వదిలిపెట్టడం లేదు. చివరికి ప్రధానమంత్రి అధికారిక నివాసంలోకి నిరసనకారులు ప్రవేశించారు. చేతికి అందిన వస్తువులను మొత్తం దోచుకు వెళ్లారు.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఎంపీ మోర్తాజా ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను రచ్చ రచ్చ చేస్తున్నాయి. మోర్తాజా ఇంటికి అగ్గిపెట్టిన విషయం తెలిసిన తర్వాత.. ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. తమ ఇళ్లను అలానే వదిలిపెట్టి వారు బతుకు జీవుడా అంటూ ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి..”అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. భూమ్మీద బతికి ఉంటే చాలు అనే తీరుగా క్రికెటర్ల పరిస్థితి ఉంది. అందుకే వారు తమ గృహాలను కూడా వదిలిపెట్టి వెళ్లిపోయారు. వారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే వారు ఇప్పట్లో తిరిగి తమ స్వదేశానికి వచ్చే అవకాశం లేదని” అంతర్జాతీయ మీడియా సంస్థలు వ్యాఖ్యానిస్తున్నాయి..
దేశంలో గత కొద్ది రోజులుగా రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ క్రికెటర్లు మౌనంగా ఉన్నారు. ఈ విషయంపై స్పందించాలని అక్కడ మీడియా పదేపదే కోరినప్పటికీ క్రికెటర్లు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారంతా ప్రధానమంత్రి షేక్ హసీనాకు మద్దతు తెలుపుతున్నారని కొంతమంది ఆందోళనకారులు ఆరోపించారు. ఇదే సమయంలో మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు. దీనివల్ల తమకు కూడా ముప్పు పొంచి ఉందని భావించి, మిగతా క్రికెటర్లు ఏకంగా కుటుంబాలతో సహా దేశం విడిచి వెళ్లిపోయారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More