Telugu Culture In America: ప్రస్తుత జనరేషన్‌లో ఉన్నత చదువుల కోసం చాలా మంది విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు. నచ్చిన దేశాలకు వెళ్లి.. నచ్చిన చదువులు చదివి.. తమకు నచ్చినట్లుగా అక్కడే సెటిల్ అవుతున్నారు. ఏటా విదేశాలకు వెళ్తు్న్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందులోనూ.. అమెరికా వెళ్తున్న వారిలో ఎక్కువ సంఖ్యలో భారతీయులే ఉంటున్నారు. ఎందుకంటే.. ఉన్నత చదువులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం అమెరికా అని అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యంలో చదువుకొని, అక్కడే ఉద్యోగం చేయాలని యువత కల అనే చెప్పాలి. అందుకే.. యూఎస్ వెళ్తున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. అందులోనూ తెలుగు వారి సంఖ్య కూడా మెజార్టీ స్థాయిలో ఉంది.
అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపిస్తున్న దేశాల జాబితాలో ఈ సారి భారత్ నంబర్ వన్ ప్లేసులో నిలిచింది. గత 15 ఏళ్లలో ఈ స్థానం సంపాదించడం ఇదే మొదటిసారి. ఇదే విషయాన్ని ‘ఓపెన్ డోర్స్’ తన నివేదికలో వెల్లడించింది. 2022-23 విద్యాసంవత్సరంలో అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్యనే ఎక్కువగా ఉండేది. ఆ తరువాతి స్థానం భారత్ విద్యార్థులది ఉండేది. కానీ.. సంవత్సరం తిరిగేసరికే సీన్ రివర్స్ అయింది. 2023-24 విద్యాసంవత్సరంలో మొదటి స్థానంలో భారతీయ విద్యార్థులు నిలిచారు. చైనా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2023-24లో అమెరికాలో 3,31,602 మంది ఇండియన్ విద్యార్థులు చదువుతున్నారు. 2022-23లో 2,68,923 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఈసారి 23 శాతం పెరగడం గమనార్హం. ఇక.. అమెరికా మొత్తం విదేశీ విద్యార్థుల్లో 29 శాతం వాటా భారతీయుల విద్యార్థులదే కావడం గమనార్హం. ఇండియా తరువాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలు ఉన్నాయి. 2008, 2009లో అమెరికాలోని మొత్తం విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉండేవారు. 15 ఏళ్ల తర్వాత ఇండియా మరోసారి ఈ ఘనత సాధించింది. ఇక అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 56శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 22 శాతం, తెలంగాణ నుంచి 34 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. యూఎస్‌లో మొత్తం 3.3 లక్షల మంది భారత విద్యార్థులు ఉండగా.. లక్షన్నరకుపైగా తెలుగు వాళ్లే ఉండడం విశేషం. ప్రస్తుతం రోజుకూ 1,600 వీసాలు జారీ చేస్తున్నారు. అలాగే.. 8వేల మంది అమెరికన్లు భారత్‌లో చదువుతున్నారు.
అలాగే.. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సైతం గత ఎనిమిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 2016లో 3.20 లక్షలు ఉన్న తెలుగు వారు 2024లో 12.30 లక్షలకు చేరుకున్నారు. దీంతో ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానానికి చేరింది. యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో హిందీ, రెండో స్థానంలో గుజరాతీ ఉన్నాయి. అమెరికా సెన్సెస్ బ్యూరో డేటా ఆధారంగా ఆ దేశ స్టాటిస్టికల్ అట్లాస్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. నాలుగో తరం వలసదారులు, స్టూడెంట్లు పెరిగిన కారణంగా తెలుగు జనాభా పెరుగుదలకు కారణమైంది. ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా తెలుగు వారు 2 లక్షల జనాభా ఉన్నారు. 1.50 లక్షల మందితో టెక్సాస్ రెండో స్థానంలో ఉంది. 1.10 లక్షలతో న్యూజెర్సీ మూడో స్థానంలో ఉంది. 2010 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగిందని అమెరికన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ చేసిన స్టడీలో వెల్లడించింది.