Telugu News » World » Sheikh hasina ran away from the country after ruling the politics of bangladesh
Sheikh Hasina : బంగ్లా దేశ్ రాజకీయాలను శాసించి.. హఠాత్తుగా దేశం వదిలి పారిపోయి.. షేక్ హసీనా ప్రస్థానమిదీ
షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్. ఈమె 1947 సెప్టెంబర్ లో జన్మించారు. 1960 చివరిదాకా ఢాకా యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకుంటున్న సమయంలోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలుపెట్టారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం లభించింది. హసీనా తండ్రి రెహమాన్ దేశ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు.
Written By:
Anabothula Bhaskar , Updated On : August 6, 2024 / 11:39 AM IST
Follow us on
Sheikh Hasina : షేక్ హసీనా.. బంగ్లాదేశ్ రాజకీయాలను తన కంటిచూపుతో శాసించారు. దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించారు. సంవత్సరాల పాటు సైనిక పరిపాలనలో బంగ్లాదేశ్ నలిగిపోతే తనదైన పరిపాలనతో స్థిరత్వాన్ని ఇచ్చారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఒకరకంగా చెప్పాలంటే వారిని నిస్సహాయులుగా మార్చేసారు. బంగ్లాదేశ్ ఉక్కు మహిళ గా పేరుపొందారు. తాజాగా దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పీఠం నుంచి అనూహ్యంగా వైదొలిగారు. అత్యంత దయనీయమైన స్థితిలో దేశం నుంచి వెళ్లిపోయారు.
తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు
షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్. ఈమె 1947 సెప్టెంబర్ లో జన్మించారు. 1960 చివరిదాకా ఢాకా యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకుంటున్న సమయంలోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలుపెట్టారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం లభించింది. హసీనా తండ్రి రెహమాన్ దేశ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు. 1975 ఆగస్టులో ముజిబుర్, ఆయన భార్య, ఆ దంపతుల ముగ్గురు కుమారులు మిలిటరీ అధికారులు జరిపిన కాల్పుల్లో దుర్మరణం చెందారు. అప్పటికి ముజిబిర్ సంతానంలో హసీనా, ఆమె సోదరీ మాత్రమే మిగిలారు. సైనికులు కాల్పులు జరిపిన సమయంలో హసీనా, ఆమె సోదరి షేక్ రెహనా విదేశాల్లో ఉన్నారు. అందువల్ల వారు ప్రాణాలు కాపాడుకోగలిగారు.
అప్పుడే దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు
సైనికులు జరిపిన కాల్పుల్లో తమ కుటుంబం మొత్తం హత్యకు గురి కావడంతో హసీనా బంగ్లాదేశ్ ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. భారత దేశంలో ఆరు సంవత్సరాల పాటు ప్రభాస జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత తన తండ్రి స్థాపించిన అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత 1981లో తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. అప్పటికి ఆదేశం సైనిక పరిపాలనలో మగ్గుతోంది. అదే సమయంలో ఆమె పలుమార్లు హౌస్ అరెస్ట్ కు గురయ్యారు. 1991 లో ఎన్నికలు జరిగినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన బలాన్ని హసీనా సంపాదించలేకపోయారు. 1996లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ ఘనవిజయం సాధించింది. దీంతో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. కేవలం ఐదు సంవత్సరాల లోపే ఆమె తన పదవిని కోల్పోయారు. 2008 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారు.
అప్పటినుంచి..
2008లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హసీనాకు ఎదురే లేకుండా పోయింది. దేశంలో అప్రతిహత పరిపాలన సాగించారు. అంతేకాదు 1971 నాటి యుద్ధానికి సంబంధించిన నేరాలపై ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను దోషులుగా తేల్చింది. దీంతో దేశవ్యాప్తంగా మళ్లీ హింస మొదలైంది. ఇదే సమయంలో బీఎన్పీ కీలక మిత్రపక్షమైన జమాత్ -ఎ- ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా 2013లో నిషేధం విధించారు.. ఇదే సమయంలో ఖలీదా జియాకు 17 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 2014 ఎన్నికలను బీఎన్పీ బాయ్ కాట్ చేసింది. ఆ తర్వాత 2018 లో రంగంలోకి దిగింది. ఆ రెండు సార్లు కూడా అవామి లీగ్ విజయం సాధించింది. ఇక ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ, దాని మిత్రబక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. ఫలితంగా హసీనా నాలుగోసారి ప్రధానమంత్రి అయ్యారు. మొత్తంగా ఐదవ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
హత్యాయత్నాలు జరిగాయి
హసీనా భర్త అణు శాస్త్రవేత్తగా పనిచేశారు. 2009లో ఆయన మరణించారు. హసీనా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హసీనా పై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఒక దేశానికి చాలా కాలం పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగిన మహిళల్లో హసీనా ఒకరు. అయితే హసీనాను నియంత అని ఆమె ప్రత్యర్ధులు తరుచుగా విమర్శిస్తుంటారు. ఆమె పరిపాలన కాలంలో అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపిస్తుంటారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.