Namibian Government: ఆఫ్రికా దేశమైన నమీబియాలో శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత కరువుతో అల్లాడుతోంది. ప్రజలు తిండి లేక.. తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆకలి తీర్చేందుకు అరుదైన జంతువులను హతమార్చాలని నిర్ణయించింది. వీటిల్లో ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు వంటివి కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన పర్యావరణ, అటవీ, పర్యటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరు చెబుతున్న జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు (హిప్పోలు), 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 జీబ్రాలు ఉన్నాయి. నమీబియా అడవుల్లో వీటి సంఖ్య తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిపుణులైన వేటగాళ్ల సాయంతో వీటిని వధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. నైరుతి ఆఫ్రికాలో కరవు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడటమే ఈ నిర్ణయం లక్ష్యమని వెల్లడించాయి.
అత్యవసర పరిస్థితి..
నమీబియాలో కరువు ప్రభలడంతో ఈ ఏడాది ఆగస్టులో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. 14 లక్షల మంది జనాభా అంటే ఆ దేశంలో దాదాపు సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని తెలిపింది. అక్కడి అడవుల్లో వన్య ప్రాణుల సంఖ్య అధికంగా ఉందని, వీటిని వధిస్తే అక్కడి నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఏనుగులు అధికంగా ఉంటాయి. అక్కడ దాదాపు 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి. గతేడాది నీటి వనరులు ఎండిపోవడంతో వందలాడి ఏనుగులు మరణించాయి. ఇప్పటికే ఆ దేశంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించడానికి 150కిపైగా అటవీ జంతువులను వధించి, మాంసం పంపిణీ చేశారు. బోట్సువానాలో 1,30,000 ఏనుగులు ఉండగా.. 2014లో ఏనుగుల వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, కరువుతో అలమటిస్తున్న స్థానికులు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో 2019లో దీనిని తొలగించింది.
ఎల్‌నినో ప్రభావంతో..
దక్షిణాఫ్రికాలోని అనేక దేశాలలో నమీబియా ఒకటి. దీనిపై ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంది. దీంతో నమీబియాలో వర్షపాతం బాగా తగ్గిపోయింది. వినాశకరమైన కరువు తాండవిస్తుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం తగ్గడానికి దారితీసిన కారణాల్లో మానవుడు కలిగించే వాతావరణ సంక్షోభం ప్రధానమైంది. అధిక ఉష్ణోగ్రతలతో కూడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయాయి. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న పదిలక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఇతర దేశాలవైపు ఆశగా ఎదురు చేస్తున్నారు.