Hydra: హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ పొటెక్ట్ అసెట్స్) సంస్థ తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రికగా దీనిని చాలా మంది అభివర్ణిస్తున్నారు. దీనిని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రంగనాథ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీ చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైడ్రా.. దశాబ్దాలుగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, నాళాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై దృష్టిపెట్టింది. ఏర్పడిన నెల రోజుల్లోనే 50 ఎకరాల భూములను చెర విడిపించింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. దీంతో అందరూ హైడ్రాను అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తూ పోతున్నారు. హైదరాబాద్‌ను కబ్జాల చెర నుంచి విడిపించడానికి కనీసం పదేళ్లు పడుతుందని ఇటీవల టీవీ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలిపారు. ఆక్రమణలు జరిగిన తీరును కూడా ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు. కబ్జా అయిన చెరువులు, కుంటలను పూర్వ స్థితికి తీసుకురావడమే లక్ష్యమని అంటున్నారు.
తెలివిగా విధుల నిర్వహణ..
ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పనితీరుగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆక్రమణల తొలగింపు బాధ్యతను ఐఏఎస్‌లకు కాకుండా ఎంతో నమ్మకంగా ఐపీఎస్ రంగనాథ్‌కు అప్పగించారు. తద్వారా ఐఏఎస్‌లు దూకుడుగా వ్యవహరించడం లేదని చెప్పకే చెప్పారు. ఇక రంగనాథ్ కూడా నిబధ్ధతతో పనిచేస్తున్నారు. ఆయన నిబద్ధతే ఇప్పటి వరకు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా ఆయన పేరు రెండు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఇక రంగనాథ్ కూడా కూల్చివేతల విషయంలో చాలా తెలివిగా, టెక్నిక్‌గా వ్యవహరిస్తున్నారు.
వీకెండ్స్‌లో వారివి కూల్చివేత..
రంగనాథ్ ప్రముఖుల ఆస్తులు కూల్చివేతను వీకెండ్స్‌లో చేపడుతున్నారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నవారి ఆస్తులను గుర్తించి శని, ఆదివారాల్లో వాటిపైకి బుల్డోజర్లను పంపుతున్నారు. ఎందుకంటే.. వీకెండ్స్‌లో కోర్టులకు కూడా సెలవు ఉంటుంది. స్టే వచ్చే అవకాశం తక్కువ. అందుకే ఆయన వారాంతంలోనే ప్రముఖులు ఆక్రమణ తొలగింపు చేపడుతున్నారు. ఇక కోర్టుకు వెళ్లలేని వారి భవనాలు, ఆక్రమణలను ఇతర రోజుల్లో తొలగిస్తున్నారు. తద్వారా కూల్చివేతలు, ఆక్రమణల తొలగింపునకు ఎక్కడా ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు.
డీజీపీ అయినా ఆశ్చర్యంలేదు..
ఇక తన పనితీరుతో అందరి నోళ్లలో నానుతున్న రంగనాథ్.. భవిష్యత్‌లో తెలంగాణ డీజీపీ అయినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు పరిశీలకులు. ఆయనకు ఏ పని అప్పగించిన దానిని కాదనకుండా పూర్తి చేస్తారనే పేరు ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా కమిషనర్‌గా ఐఏఎస్‌ను కాకుండా ఐపీఎస్‌ను నియమించారు. ఆయనకు చట్టంపై పూర్తి అవగాహన ఉండడం, చట్టాలను ఎలా ఉపయోగించాలో పూర్తిగా తెలిసి ఉండడంతో ఆక్రమణల తొగింపునకు ఎలాంటి ఆటంకాలు రావన్న నమ్మకంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. కోర్టు పరిధిలోని అంశాలను కూడా ఆయన చాకచక్యంగా పరిష్కరిస్తారని భావిస్తున్నారు. సీఎం అంచనాల మేరకే రంగనాథ్ పనిచేస్తున్నారు. ఇందుకు ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడమే కాకుండా.. దానిని ఎలా నిర్మించారో కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.