Saudi Prince: అన్ని కోట్లు పెట్టి ఆ పెయింటింగ్‌ ఎందుకు కొన్నట్లు.. తనను హత్య చేస్తారన్న అనుమానం ఎందుకొచ్చింది.. సంచలనం రేపుతున్న సౌదీ యువరాజు వ్యవహారం!

సౌదీ అరేబియా యువరాజును హత్య భయం వెంటాడుతోంది. ఇటీవలే భారీగా నగదు చెల్లించి ఓ పెయింటింగ్‌ కొనుగోలు చేసిన ఆ యువరాజు దాని తర్వాత తాను హత్యకు గురవుతానని ప్రకటించడం సంచలనం రేపుతోంది.

Written By: Raj Shekar, Updated On : August 26, 2024 10:55 am

Saudi Prince

Follow us on

Saudi Prince: రాజులు పోయారు.. రాచరికాలు పోయాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రభువులు, ప్రజలు ఎన్నుకుంటేనే పాలకులు ఎన్నికయ్యేది. అయినా ఇప్పటికీ కొన్ని దేశాల్లో రాచరికపు ఆనవాళ్లు, పోకడలు ఉన్నాయి. కొనసాగుతున్నాయి. యూకేతోపాటు గల్ఫ్‌ దేశాల్లో రాచరికపు సంస్కృతిక ఇంకా కొనసాగుతోంది. గల్ఫ్‌ దేశం సౌదీ అరేబియా రాజు 90 ఏళ్ల అబ్దుల్లా బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ 2015 జనవరిలో తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన సోదరుడు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ రాజు కాబోతున్న సమయంలో అల్‌ సౌద్‌ కుమారుడు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కూడా అధికారం కోసం సిద్ధమయ్యారు. మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను ఎంబీఎస్‌ అని పిలుస్తుంటారు. అప్పటికి ఆయన వయసు 29 ఏళ్లు. అయితే సౌదీ అరేబియా సామ్రాజ్యం కోసం ఎంబీఎస్‌ చాలా పెద్ద ప్లాన్‌ వేశారు. అది సౌదీ అరేబియా చరిత్రలోనే అతిపెద్ద పథకం అని భావించవచ్చు. సొంత రాజకుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారని ఆయన భయపడ్డారు. దీంతో ఆ నెలలో ఒకరోజు రాత్రి ఎంబీఎస్‌ ఒక సీనియర్‌ భద్రతాధికారిని ప్యాలెస్‌కు పిలిపించారు. ఆయన పేరు సాద్‌ అల్‌ జాబ్రీ. ఆయన ఫోన్‌ను గది బయటే టేబుల్‌పై ఉంచాలని చెప్పారు. ఎంబీఎస్‌ కూడా ఫోన్‌ను బయటే ఉంచారు. రాజభవనంలోని గూఢచారుల పట్ల యువరాజు సల్మాన్‌ ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, గదిలో ఉన్న ఏకైక ల్యాండ్‌లైన్‌ వైర్‌ను కూడా తీసేశారు.

సల్మాన్‌ ప్రణాళిక..
‘నిద్రలో ఉన్న దేశాన్ని’’ ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒక ప్రణాళిక రూపంలో ఎంబీఎస్‌ వివరించారని జాబ్రీ చెప్పారు. ఆ ప్రణాళికతోనే ప్రపంచ వేదికపై సౌదీ సరైన స్థానాన్ని పొందగలదని ఆయన చెప్పారని తెలిపారు. ఆరామ్‌కోలోవాటాలను విక్రయించి, చమురుపై తన ఆర్థిక వ్యవస్థ ఆధారపడటం ఆపేస్తానని ఎంబీఎస్‌ చెప్పారు. టాక్సీ సంస్థ ఉబెర్, సిలికాన్‌ వ్యాలీలోని టెక్‌ స్టార్టప్‌లలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడతానన్నారు. సౌదీ మహిళలకు పని చేసే స్వేచ్ఛను కల్పించడం ద్వారా దేశంలో 60 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తానని ఆయన చెప్పారు.

సౌదీని నియంత్రణలోకి తెచ్చుకున్న ఎంబీఎస్‌..
రాజు ప్రాబల్యం తగ్గుతుండటంతో 38 ఏళ్ల ఎంబీఎస్‌ ఇప్పుడు సౌదీని నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. ఆయన అప్పట్లో సాద్‌ అల్‌–జాబ్రీకి చెప్పిన అనేక ముఖ్యమైన ప్రణాళికలను ఇపుడు అమల్లోకి తీసుకొస్తున్నారు. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించటం, మరణశిక్షను విస్తృతంగా ఉపయోగించడం, మహిళా హక్కుల కార్యకర్తలను జైలుకు పంపడం వంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

పెయింటింగ్‌ కోసం వేల కోట్లు
ఎంబీఎస్‌ 2017లో ఒక ప్రసిద్ధ పెయింటింగ్‌ని కొనుగోలు చేసిన సంఘటనను పరిశీలిస్తే ఆయన దృష్టి కోణాన్ని, ఆలోచనలను అంచనా వేయవచ్చు. ఈ పెయింటింగ్‌ కొనుగోలు ఎంబీఎస్‌ రిస్క్‌ టేకర్‌ అని స్పష్టంగా సూచిస్తుంది. ప్రసిద్ధ సాల్వేటర్‌ ముండి పెయింటింగ్‌ కోసం ఎంబీఎస్‌ సుమారు రూ.3,772 కోట్లు (450 మిలియన్‌ డాలర్లు) వెచ్చించారు. ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన కళాఖండం ఇదే. లియోనార్డో డావిన్సీ వేసిన ఈ పెయింటింగ్‌ యేసు క్రీస్తును స్వర్గానికి, భూమికి ప్రభువుగా, ప్రపంచ రక్షకునిగా వర్ణిస్తుంది. ఇపుడు ఆ పెయింటింగ్‌ కనిపించడం లేదు. పెయింటింగ్‌ జెనీవాలో ఉందనే వార్తలను యువరాజు స్నేహితుడు, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలోని నియర్‌ ఈస్టర్న్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ అయిన బెర్నార్డ్‌ హెకెల్‌ ఖండించారు. దీనిని ప్రిన్స్‌ ప్యాలెస్‌లో పెట్టారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆ పెయింటింగ్‌ను సౌదీ రాజధానిలో ఇంకా నిర్మించని మ్యూజియంలో ఎంబీఎస్‌ ఉంచాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాదు, 2034 ఫీఫా ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి బిడ్డింగ్‌ వేసిన ఏకైక దేశం సౌదీ అరేబియా. అనంతరం టెన్నిస్, గోల్ఫ్‌ టోర్నమెంట్‌లలో బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. దీనిని ‘స్పోర్ట్స్‌వాషింగ్‌‘గా అభివర్ణిస్తున్నారు.

జమాల్‌ ఖషోగ్జీ హత్య
2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్జీ హత్య జరిగింది. ఆయన హత్యకు గురైన విధానం ఎంబీఎస్‌ ప్రమేయాన్ని బలపరుస్తోంది. 2021 ఫిబ్రవరిలో విడుదలైన అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక ‘ ఖషోగ్జీ హత్యలో ఎంబీఎస్‌ భాగస్వామి’ అని ఆరోపించింది. ఎంబీఎస్‌ తండ్రి రాజు సల్మాన్‌ వయస్సు ఇప్పుడు 88 సంవత్సరాలు. దీంతో ఎంబీఎస్‌ సౌదీ అరేబియాను 50 సంవత్సరాలు పాలించగలరని నమ్ముతున్నారు. అయితే, సౌదీ–ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలను సాధారణీకరించడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా తనను హత్య చేసే అవకాశం ఉందని ఎంబీఎస్‌ భావిస్తున్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్‌ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికో కథనం ప్రచురించింది. ఈజిప్టు ఒకప్పటి అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ రక్షణ విషయంలో అమెరికా ఏం చేసిందని ఆయన కాంగ్రెస్‌ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈజిప్ట్‌ కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణస్థితికి తెస్తూ ఆయన క్యాంప్‌ డేవిడ్‌లో ఒప్పందం చేసుకొన్నారు. ఇది జరిగిన తర్వాత 1981లలో కొందరు ఉగ్రవాదులు అన్వర్‌ను కాల్చి చంపారు. తనకు మృత్యుభయాలు ఉన్నా.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ముందుకుతీసుకెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఎంబీఎస్‌ తెలిపారు.