Saudi Arabia Kafala System: ఒకవైపు ఆర్థిక వేత్తలు, వ్యాపారులు వారానికి 90 గంటలు పని చేయాలంటున్నారు. ఇంకోవైపు ఐటీ సంస్థలు వారానికి రెండు రోజులు సెలవులు అమలు చేస్తున్నా.. పనిదినాల్లో గంటలతో పనిలేకుండా పని చేయిస్తున్నాయి. ఒకరకంగా ఆధునిక వెట్టిచాకిరీ సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ దేశాలకు వెళ్తున్న కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది. దశాబ్దాలుగా వలస కార్మికులు బానిసల్లా పనిచేస్తున్నారు. ఈ కఫాలా వ్యవస్థపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి వెళ్లిన వలస కార్మికులకు ఇది కొత్త ఆశాకిరణంగా మారింది.
కఫాలా వ్యవస్థ అంటే ఏమిటి?
‘‘కఫాలా’’ అనే అరబిక్ పదం అంటే ‘‘ప్రాయోజకత్వం’’ అని అర్థం. 1950 దశకంలో చమురు ఆవిష్కరణలతో గల్ఫ్ దేశాలకు భారీగా శ్రామికులు అవసరమయ్యారు. దేశీయ కార్మిక సమస్యలకు పరిష్కారంగా ఈ వ్యవస్థను రూపొందించారు. అయితే కాలక్రమంలో ఇది యజమాని ఆధిపత్య వ్యవస్థగా మారి, వలస కార్మికుల స్వేచ్ఛను పూర్తిగా హరించింది. కార్మికుల పాస్‌పోర్టును యజమాని స్వాధీనం చేసుకుంటాడు. ఉద్యోగం మార్చుకోవాలంటే లేదా దేశం విడిచి వెళ్లాలంటే యజమాని అనుమతి తప్పదు. అనారోగ్యం, కుటుంబ అత్యవసరాలు ఉన్నా అనుమతి లేనిదే ప్రయాణం చేయలేరు. ఇలా వ్యవస్థాత్మకంగా కార్మికులు స్వేచ్ఛా హక్కులు కోల్పోయారు. మానవ హక్కుల సంస్థలు దీనిని ఆధునిక బానిసత్వంగా అభివర్ణించాయి.
సౌదీ.. మార్పు సంకేతాలు
సౌదీ ప్రభుత్వం ఇటీవల కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ ‘‘విజన్ 2030’’లో భాగంగా పెద్ద సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. చమురుపై ఆధారాన్ని తగ్గించి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో దేశం తన కార్మిక విధానాన్ని మానవతా కోణంలో సరిచేస్తోంది. ఈ మార్పుతో సౌదీ అంతర్జాతీయ ప్రతిష్ఠను పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌదీ జనాభాలో సుమారు 40 శాతం మంది వలస కార్మికులే. వారిలో సుమారు 75 లక్షల మంది భారతీయులు. నిర్మాణం, గృహ సేవలు, పారిశుద్ధ్య పనులు, డ్రైవింగ్ వంటి వృత్తుల్లో పనిచేస్తున్నారు. సౌదీ కఫాలా రద్దు నిర్ణయం ఇతర గల్ఫ్ దేశాలపై కూడా ఒత్తిడి పెంచనుంది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమన్‌లో ఇప్పటికీ కొంత కఫాలా కోణం కొనసాగుతుండగా, ఖతార్ మాత్రం ఇటీవల సమానత్వ నిబంధనలను అమలు చేసింది.
కొన్నేళ్లుగా మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, భారత్ వంటి కార్మిక మూల దేశాలు సౌదీపై ఉన్న ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా కఫాలకు గల్ఫ్ దేశాలు స్వస్తి పలుకుతున్నాయి. సౌదీ నిర్ణయం కేవలం పరిపాలనా మార్పు కాదు, ఆర్థిక వ్యవస్థపైనే కాక మానవ విలువలపైనా దృష్టి సారించిన సంస్కరణ. వలస కార్మికులకు ఇది కొత్త ఆశా కిరణం.