Russia India Relations: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ మన ఆయుధ శక్తిని పెంచుకునే చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి కొనుగోలు చేయడం తగ్గించి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలు తయారు చేస్తోంది. ఇందుకు వివిధ దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సిద్ధమవుతుండగా, మాస్కో ఎస్‌యూ–57 యుద్ధవిమానం ఉత్పత్తిని భారతదేశంలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చేసింది. ఇది కేవలం డెలివరీ ప్రాజెక్టు కాకుండా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సహ–ఉత్పత్తి ప్రణాళికగా ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా భారత్ ఐదవ తరం స్టెల్త్ జెట్లలో తయారు చేసే అవకాశం ఉంది.
భారత రక్షణ శక్తికి ప్రాధాన్యత
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రస్తుతం ఎస్‌యూ–30 ఎంఎకేఐని ప్రధాన దళంగా వినియోగిస్తోంది. ఎస్‌యూ–57 వంటి అధునాతన స్టెల్త్ ఫైటర్ ఉత్పత్తి దేశీయ రక్షణ రంగానికి సాంకేతిక నూతనాధ్యాయంగా నిలుస్తుంది. ఫోర్త్, ఫిప్త్ జనరేషన్ ఫైటర్ల మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసే ఈ జెట్ ఆధునిక యుద్ధ మౌలికతలను గణనీయంగా మార్చగలదు. ఈ ప్రతిపాదన అమెరికా–భారత్ రక్షణ భాగస్వామ్యంపై కూడా వ్యూహాత్మక ప్రభావం చూపవచ్చు. ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీని మాస్కోతో పంచుకోవడాన్ని చూసి, అమెరికా తన ఎగుమతి విధానం పునఃపరిశీలించే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ ‘మల్టీ్ట–వెక్టర్’ డిఫెన్స్ డిప్లమసీని మరింత సమతుల్యం చేస్తోంది.
‘మేక్ ఇన్ ఇండియా’కు బలమేనా
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఇప్పటికే ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా స్వదేశీ స్టెల్త్ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తోంది. రష్యన్ సహకారం వస్తే ఈ డెవలప్మెంట్ వేగవంతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. సాంకేతిక బదిలీతో పాటు స్థానిక పరిశ్రమ సామర్థ్యం విస్తరిస్తుంది. భారతదేశానికి ఇది ద్విపాక్షిక అవకాశంతోపాటు ఆర్థిక–సాంకేతిక బాధ్యత కూడాను. ఎస్‌యూ–57 ప్రాజెక్టులో భాగస్వామ్యం సాధ్యమైతే నూతన ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక మేధస్సు, రక్షణ ఎగుమతులకు వేదికలు తెరుచుకునే అవకాశం ఉంది.