Homeఅంతర్జాతీయంQatar visa restrictions Pakistan: పాకిస్తాన్‌కు మరో షాక్‌.. ఈసారి ఖతార్‌ వంతు..!

Qatar visa restrictions Pakistan: పాకిస్తాన్‌కు మరో షాక్‌.. ఈసారి ఖతార్‌ వంతు..!

Qatar visa restrictions Pakistan: ఇరాన్‌ – అమెరికా యుద్ధం పాకిస్తాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. ఇప్పటికే అప్పులతో సతమలమవుతున్న పాకిస్తాన్‌ యుద్ధం కారణంగా మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పులు ఇచ్చేవారు లేకపోగా, ఇప్పటికే అప్పులు ఇచ్చినవారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్‌ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన భౌగోళిక రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇరాన్‌ లాంటి కీలక పొరుగు దేశం నమ్మకాన్ని కోల్పోవడం, మరోవైపు సౌదీ అరేబియా, చైనా, యూఏఈ లాంటి మిత్ర దేశాల నుంచి ఆర్థిక ఒత్తిళ్లు ఎదురవడం పాక్‌ పాలకులకు తలనొప్పిగా మారాయి. అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న పాకిస్తాన్‌ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.

దౌత్యపరమైన పరాజయం..

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్తాన్‌ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఇరాన్‌ తన కాన్సులేట్‌ ద్వారా స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌ విశ్వాసమైన మిత్రుడు కాదని, ఆయన చేసే మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పింది. పాకిస్తాన్‌ నిర్వహించే ఏ చర్చలకు కూడా తాము హాజరు కామని ఇరాన్‌ స్పష్టం చేసింది. యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తుంచుకోవాలని, పాకిస్తాన్‌ ద్వంద్వ ధోరణిని ఇరాన్‌ ఎండగట్టింది. ప్రాంతీయ శక్తిగా పాకిస్తాన్‌ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నట్లు సంకేతం. దశాబ్దాలుగా ఇరాన్‌తో సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణలు ఈ అవిశ్వాసానికి మూలకారణాలు.

దెబ్బకొడుతున్న తాలిబాన్లు…
పాకిస్తాన్‌ భద్రతా పరిస్థితి అగ్నిపర్వతం లా మారింది. తాను పెంచి పోషించిన తాలిబాన్లే ఇప్పుడు పాక్‌కు శాపంగా మారారు. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లు పాకిస్తాన్‌ను ’దెబ్బ మీద దెబ్బ’ కొడుతున్నారు. సరిహద్దులోని 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసి, పాక్‌ సైనిక స్థావరాలపై భీకర దాడులకు సిద్ధమయ్యారు.

అంతర్గత తిరుగుబాట్లు..
ఖైబర్‌ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్‌ ప్రాంతాల్లో తిరుగుబాట్లు ఉగ్రరూపం దాల్చాయి. తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్తాన్‌ సుమారు 15 వేల మంది యోధులతో సరిహద్దుకు చేరుకుంటోందని సమాచారం. ఇది పాక్‌ సైన్యాన్ని రెండు చోట్ల యుద్ధానికి సిద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బలూచ్‌ వీరులు కూడా తిరుగుబాట్లు తీవ్రం చేశారు.

మిత్ర దేశాల ఒత్తిళ్లు

పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన దశలో ఉంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న పాక్‌పై మిత్ర దేశాలు ఒత్తిళ్లు పెంచాయి. సౌదీ–పాక్‌ రక్షణ ఒప్పందం ప్రకారం, ఇరాన్‌ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌ ఇరాన్‌పై దాడి చేయాలని సౌదీ ఒత్తిడి చేస్తోంది లేదంటే, ఇచ్చిన అప్పులను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇది పాక్‌ను యుద్ధానికి సిద్ధం చేయడానికి ప్రయత్నించడమే. విద్యుత్‌ ప్రాజెక్టుల బిల్లుల బకాయిల కోసం చైనా ఒత్తిడి చేస్తోంది. యూఏఈ కూడా అప్పుల చెల్లింపు కోసం నిలదీస్తోంది. నగదు నిల్వలు అడుగంటిన పాక్‌కు ఇవి తీరని భారంగా మారాయి.

షాక్‌ ఇచ్చిన ఖతార్‌..
తాజాగా ఖతార్‌ పాకిస్తానీలకు వీసా విధానంలో కఠినత చూపింది. ఇప్పటి వరకు పాకిస్తానీలు ఖతార్‌ చేరుకున్న తర్వాత కూడా వీసా తీసుకునే సదుపాయం ఉండేది. దానిని ఇప్పుడు రద్దు చేసింది. దీంతో లక్షల మంది పాకిస్తానీ కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇది పాకిస్తాన్‌ పౌరులపై నేరుగా దెబ్బ కొట్టినట్లు.

పాకిస్తాన్‌ తన వ్యూహాత్మక తప్పులకు భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదు. చేయకపోతే ఆర్థికంగా కుప్పకూలుతుంది. ఈ ఉచ్చు నుంచి బయటపడటం పాక్‌ పాలకులకు అతిపెద్ద సవాల్‌. ప్రాంతీయ స్థిరత్వానికి పాకిస్తాన్‌ శాపంగా మారిన పరిస్థితి నెలకొంది.

 

 

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version