Satya Nadella: సత్య నాదెళ్ల గురించి తెలియని వాళ్లు ఉండరు. ప్రపంచంలోనే మూడవ అత్యంత విలువైన కంపెనీ మైక్రోసాఫ్ట్ కు సీఈవో. దీన్ని బట్టి ఆయన ప్రతి క్షణం ఎంత బిజీగా ఉన్నారో అర్థం అవుతుంది. కానీ ఒక యూట్యూబర్ అతడిని కేవలం ఒకే ఒక మెయిల్ తో పాడ్‌కాస్ట్ చేయమని ఒప్పించాడు. అది కూడా కేవలం నాలుగు నిమిషాల్లోనే. ఆ పాడ్‌కాస్టర్ తన పని ఇంత సులువుగా పూర్తి అవుతుందని ఊహించలేదు. భారత సంతతికి చెందిన యూట్యూబర్ ద్వారకేష్ పటేల్ నాదెళ్లకు నేరుగా ఈమెయిల్ పంపి, ‘మీరు నా పాడ్‌కాస్ట్‌లోకి వస్తారా?’ అని అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో ప్రముఖ టెక్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు, వ్యాపార దిగ్గజాలు యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాడ్ కాస్ట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి వారిని రప్పించేందుకు యూట్యూబర్లు చాలా శ్రమించాల్సి వస్తుంది. కానీ భారత సంతతికి చెందిన ఓ యూట్యూబర్ కేవలం నాలుగు నిమిషాల్లో ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను ఇంటర్వ్యూకు ఆహ్వానించాడు. చిన్న సాధారణ ఇ-మెయిల్ సాయంతో ఇది సాధించాడు.
అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన యూట్యూబర్ ద్వారకేశ్ పటేల్.. ఇప్పటికే ప్రముఖులు, టెక్ సంస్థల సీఈవోలతో పాడ్‌కాస్ట్‌లు నిర్వహిస్తుంటాడు. తన ఛానల్ కు సంబంధించింన న్యూస్‌లెటర్ సబ్‌స్క్రైబర్ల లిస్ట్‌లో ఉన్న సత్య నాదెళ్లను షోకు ఆహ్వానించేందుకు నేరుగా ఇ- మెయిల్ పంపించాడు. ‘‘హాయ్ సత్య, నా న్యూస్‌లెటర్ సబ్‌స్క్రైబర్ జాబితాలో మీరు ఉండడం గమనించాను. మీరు నా షోలో పాల్గొనేందుకు మీరు ఆసక్తిని కలిగి ఉన్నారా ’’ అంటూ చిన్న ఇ- మెయిల్‌ను సెండ్ చేశాడు. ఇప్పటికే మార్క్ జుకర్‌బర్గ్, టోనీ బ్లెయిర్ వంటి ప్రముఖులు తన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నట్లు అందులో చెప్పుకొచ్చాడు. ఇ-మెయిల్‌ని పంపిన కేవలం 4 నిమిషాల్లోనే సత్య నాదెళ్ల నుంచి రిప్లై రావడంతో ఆ యూట్యూబర్ ఆశ్చర్యపోయాడు.
ద్వారకేశ్ పటేల్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తను పంపిన ఇ-మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను నెటిజన్లకు షేర్ చేశాడు. తాజాగా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌తో తన ప్రయాణం గురించి వివరించాడు. గత 34 ఏళ్లుగా చాలా ఉత్సాహంగా ఉన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అంశాల గురించి ఈ పాడ్‌కాస్ట్‌లో ఇద్దరూ చర్చించారు.