Pakistan US relations: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కొన్ని రోజులుగా పాకిస్తాన్ ప్రేమలో పడ్డాడు. ఆ దేశంపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నాడు. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో వరుసగా సమావేశమవుతున్నారు. పాకిస్తాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీష్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. సడెన్‌గా ట్రంప్ వైఖరిలో ఇంత మార్పు ఏమిటన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల సందర్భంగా అరుదైన ఖనిజ సంపదను ప్రదర్శించడం ద్వారా పెట్టుబడులు, సహకారాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. ఇది చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేసే అమెరికా వ్యూహంగా ఉంది.
వైట్ హౌస్‌లో సమావేశం..
ఇటీవల వైట్ హౌస్‌లో జరిగిన భేటీలో పాక్ డెలిగేషన్ ట్రంప్‌కు ఒక ప్రత్యేక చెక్క పెట్టెలో అరుదైన ఖనిజాల నమూనాలను అందజేసింది. ఈ ఫొటోలను అమెరికా అధికారికంగా విడుదల చేయడం రెండు దేశాల మధ్య పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తుంది. మునీర్ ఈ ఖనిజాల గురించి వివరిస్తుండగా ట్రంప్ ఆసక్తి చూపడం, ఇది సాధారణ భేటీకి మించిన వ్యూహాత్మక సంభాషణలను సూచిస్తుంది. అరుదైన ఖనిజాల కోసమే ట్రంప్ ఆరేళ్ల తర్వాత పాక్ ప్రధానిని వైట్ హౌస్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
చైనా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం..
ట్రంప్ చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. ఈ ఖనిజాలు ఎలక్ట్రానిక్స్, రక్షణ, పునరుత్పాదక ఇంధనాల్లో కీలకం, చైనా మార్కెట్‌లో 80% వాటా కలిగి ఉంది. పాకిస్తాన్ భారీ ఖనిజ నిల్వలు కలిగి ఉండటం ద్వారా అమెరికాకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాన్ని అందిస్తుంది. మునీర్ ఇంటర్వ్యూలో పాక్ సంపదను ఉపయోగించి రుణాలను తగ్గించి, ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్‌లు, సబ్సిడీల ద్వారా అమెరికా ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ఈ భాగస్వామ్యానికి మద్దతు ఇస్తున్నాయి.
అమెరికా పెట్టుబడులు..
అమెరికా స్ట్రాటజిక్ మెటల్స్ సంస్థ పాక్ ఫ్రంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్‌తో 500 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పాకిస్తాన్‌లో పాలీ మెటాలిక్ రిఫైనరీ నిర్మిస్తుంది. ఇందులో రాగి, బంగారం, అంటిమోనీ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ ఒప్పందం మూడు దశల్లో అమలు కానుంది, మొదటి దశ 2025-26లో ఎగుమతులపై దృష్టి సారిస్తుంది. బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లోని నిల్వలు ఈ ప్రాజెక్టుకు మూలాధారం. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది, అమెరికా సరఫరా గొలుసును బలపరుస్తుంది.
రేర్ ఎర్త్ మినరల్స్ చూపి ట్రంప్‌ను బుట్టలో వేసుకున్న పాకిస్తాన్.. ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ ఖనిజాల వెలికితీత సామర్థ్యం, భద్రతా సమస్యలు సవాళ్లుగా మారవచ్చు. అమెరికా వైపు నుంచి ఇది చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా జాతీయ భద్రతను పటిష్ఠం చేస్తుంది. మొత్తంగా, ఈ చర్యలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాల్లో అమెరికా ప్రభావాన్ని పెంచుతాయి. పాక్ సైన్య పాత్రను మరింత పెంచుతాయి.