Pakistan peace claims vs internal unrest: పశ్చిమాసియా యుద్ధం ఆగేందుకు తామే కారణమని, ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల సీజ్‌ఫైర్ కుదిర్చామని పాకిస్తాన్ కాలర్ ఎగరేస్తోంది. ప్రపంచం తమను శాంతి దేశంగా గుర్తించాలని కోరుతోంది. శాశ్వత శాంతి కోసం ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపేలా ఏర్పాటు చేశామని చెప్పుకుంటోంది. కానీ సొంత ఇంట్లో అశాంతి మంటలను ఆర్పడంలో విఫలమవుతోంది. ఒకవైపు ప్రపంచానికి శాంతి దూతగా నటిస్తూ, మరోవైపు బలూచిస్తాన్‌లో తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) దాడులు ఇప్పుడు భూమి నుంచి సముద్రం వరకు విస్తరించడం ఇస్లామాబాద్‌ను గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
బీఎల్‌ఏ వ్యూహాత్మక మార్పు
గతంలో భూమిపై మాత్రమే పనిచేసిన బీఎల్‌ఏ, ఇప్పుడు సముద్ర మార్గంలోకి అడుగుపెట్టింది. గ్వాదర్‌కు సమీపంలోని జివానీ వద్ద పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ స్పీడ్‌బోట్‌పై జరిగిన దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాకిస్తాన్ మీడియాలో కనిపించకపోయినా, బలూచ్ యూట్యూబ్ ఛానెళ్లలో వైరల్ అయ్యింది. గన్స్‌తో కాల్పులు జరిపారా? లేదా పేలుడు పదార్థాలతో నిండిన పడవతో ఢీకొట్టారా? లేదా డ్రోన్ దాడి జరిగిందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
గతేడాది 500 డ్రోన్ దాడులు..
2025లో పాకిస్తాన్ సైన్యంపై బీఎల్‌ఏ 500 డ్రోన్ దాడులు చేసింది. ఇప్పుడు నౌకాదళ సామర్థ్యాన్ని కూడా సంతరించుకుందా అన్న ఆందోళన కలుగుతోంది. ఎల్‌టీటీఈ తర్వాత సముద్ర యుద్ధ నైపుణ్యం సాధించిన తిరుగుబాటు దళంగా బీఎల్‌ఏ మారితే, అది పాకిస్తాన్‌కు మహా ప్రమాదం. జివానీ దాడి కేవలం ఒక సంఘటన కాదు, అది పాకిస్తాన్ భద్రతా వ్యవస్థలోని లోటుపాట్లను బయటపెట్టింది. ఈ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్న గ్వాదర్ పోర్టుకు సమీపంలో ఉంది. అమెరికా నిఘా కేంద్రం ఉన్న పస్ని ఎయిర్ బేస్‌కు దగ్గరగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీకి సమీపంలోనే జరిగింది. చైనా లిజనింగ్ పోస్టు కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలో దాడి జరగడం చైనాను కూడా ఆందోళనకు గురిచేసింది. బీఎల్‌ఏ వద్ద స్పీడ్‌బోట్లు, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయంటే, వారికి విదేశీ మద్దతు ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
దివాళా తీసిన పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ..
గత 40 గంటల్లోనే 145 మంది తీవ్రవాదులను హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించుకున్నా, బీఎల్‌ఏ దాడులు ఆగడం లేదు. సైనిక కాన్వాయ్‌లు, హెలికాప్టర్లు, అధికారులు, ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా నిరంతరం దాడులు జరుగుతున్నాయి. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత ఇప్పుడు సముద్ర దాడితో పాక్ సైన్యం మూడు వైపులా చిక్కుకుంది.
పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి విషాదకరం. ఒకవైపు గల్ఫ్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ, మరోవైపు స్వంత భూభాగాన్ని కోల్పోతుంది. బీఎల్‌ఏ నౌకాదళ సామర్థ్యం సాధిస్తే, పాకిస్తాన్ ఆర్థిక జీవనాడారమైన కరాచీ ఓడరేవు, చైనా పెట్టుబడులున్న గ్వాదర్ ప్రమాదంలో పడతాయి. ఇరాన్, ఆఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదం, అంతర్గత కురుక్షేత్రం పాకిస్తాన్‌ను పీసులు పీసులుగా చేస్తున్నాయి. బీఎల్‌ఏ దాడులు ఇలాగే కొనసాగితే, పాకిస్తాన్ విచ్ఛిన్నం అవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
