Pakistan: పాకిస్తాన్ కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. దీనిని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ అప్పులపైనే ఆధారపడుతోంది. ఈ తరుణంలో విలువలకు వలువలు వదులుతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షన్ ఆసిమ్ మునీర్ తమ దేశంలోని అరుదైన ఎర్త్ మినరల్స్ పట్టుకుని కొనండి బాబూ అంటూ ప్రపంచ దేశాలను బతిమిలాడుతున్నారు. ఈ క్రమంలో అమెరికాతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక డబ్బుల కోసం ఇటీవలే సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందం చేసుకుంది. తాజాగా ఇస్లాం సిద్ధాంతాలనే తాకట్టు పెట్టింది. ఇస్లామిక్ నాటోకు ప్రయత్నించిన పాక్.. ఇప్పుడు మరో పాకిస్తాన్ దేశంపై దాడికి సైనికులను పంపుతోంది. అమెరికా ఇచ్చే డబ్బుల కోసం పాలస్తీనాలోని ముస్లింలను చంపేందుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంది.
పాలస్తీనాపై అంతటా సానుభూతి..
సాధారణంగా పాలస్తీనా అంటే ముస్లిం ప్రపంచం మొత్తానికి సానుభూతి ఉంటుంది. పాకిస్తాన్ మాత్రం అందుకు విరుద్ధ దిశలో పయనిస్తోంది. బహిరంగంగా ఇజ్రాయెల్ వ్యతిరేకతను ప్రదర్శిస్తూ, అంతర్గతంగా అమెరికా మద్దతు కోసం అదే దేశానికి సేవలు అందిస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ సరిహద్దులో పహరా కాసేందుకు 20 వేలమంది సైనికులను పంపించాలన్న నిర్ణయం ఈ వైఖరికి స్పష్టమైన ఉదాహరణ. గాజా సరిహద్దులో ఈ సైన్యం మోహరిస్తారు. హమాస్ మిలీషియాలను అణిచివేయడం, పాలస్తీనియన్లకు ఆయుధ సహాయం నిలిపివేయడం. కొంతకాలం క్రితం వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించని ఇస్లామాబాద్ ఇప్పుడు దాని భద్రత కోసం యుద్ధరంగంలోకి దిగడం ప్రాంతీయ ముస్లిం దేశాల ద్రోహిగా నిలిచింది. ఖతార్, ఇరాన్, టర్కీ వంటి దేశాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి.
అమెరికా కోసం రహస్య ఒప్పందాలు
సీఐఏ, మొసాద్ మధ్య రహస్య చర్చల తరువాత పాకిస్తాన్ 20 వేల సైన్యాన్ని పంపేందుకు అంగీకరించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశానికి అమెరికా అందించే నిధులే ప్రధాన ప్రేరణగా కనిపిస్తున్నాయి. ఈ సైన్యం కేవలం కిరాయికూలీ దళంగా వ్యవహరించబోతోందని పాశ్చాత్య విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాలస్తీనా రక్షణను నినదించే చాలా ముస్లిం దేశాలు వాస్తవానికి ఇజ్రాయెల్‌తో వ్యాపారం, రక్షణ రంగాలలో సహకరించడం గమనార్హం. జోర్డాన్, ఈజిప్ట్, టర్కీ, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే దౌత్య సంబంధాల్లో ఉన్నాయంటే, ఇస్లామిక్ ఐక్యత అనేది కేవలం నినాదంగా మాత్రమే మిగిలినట్లు తేలుతోంది.
పాకిస్తాన్ నిర్ణయంపై నిరసన..
పాలస్తీనాపై చర్యలకు దేశీయంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెహ్రీకే లబ్బైన్ పాకిస్తాన్ సంస్థ దీనిని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి దిగగా, పోలీసు కాల్పుల్లో వందల మంది చనిపోయారు. సంస్థ నాయకుడు షాద్ రిజ్వీని కాల్చివేయడంపై సైతం అంతర్జాతీయ విమర్శలు వెల్లువెత్తాయి.
మొత్తంగా అన్ని దిశల్లో బలహీనతతో సతమతమవుతున్న పాకిస్తాన్, కొంత ఆర్థిక సహాయం కోసం ఇస్లామిక్ సిద్ధాంతాలను పక్కన పెడుతోంది. ముస్లిం దేశాల ఏకతను కాపాడే ప్రయత్నాలు కాగితంపై మాత్రమే మిగిలిపోయాయి. ఇస్లామాబాద్ కొత్త మార్గం ప్రపంచ ఇస్లామిక్ మార్గదర్శకత్వంపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.