Shehbaz Sharif begging for money: అప్పు దొరికితే చాలు.. ఎక్కడికైనా వెళ్దాం. ఎవరి కాళ్లయినా పట్టుకుంటాం. అప్పు ఇవ్వకపోతే గడ్డాలు పట్టుకొని బతిమిలాడుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టైనా సరే.. దేశంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను కట్టబెట్టైనా సరే అప్పులు తెచ్చుకుంటాం.. ఇదిగో ఇలా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పుడు మాత్రమే కాదు, చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ పరిస్థితి అత్యంత అయోమయంగా ఉంది.
ఇలా అందిన చోటల్లా అప్పులు చేసుకుంటూ పోవడంతో పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. కనీసం రోజువారీ అవసరాలకు కూడా పాకిస్తాన్ వద్ద రిజర్వ్ నిధులు లేవు. దీంతో పాకిస్తాన్ పరిపాలకులు అప్పుల కోసం వేట మొదలు పెడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న దేశాల వద్దకు వెళ్లి అప్పుడు తెచ్చుకుంటున్నారు.
తమ దేశం ఎంతటి ఆర్థిక కష్టాలలో ఉందో ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. తాజాగా ఆయన పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మరో కీలక విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇస్లామాబాద్ లో ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి దేశంలో ఉన్న ఎగుమతి దారులు, వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ తన మనసులో ఉన్న విషయాలను బయటపెట్టారు. ఆర్మీ చీఫ్ మునీర్ తో కలిసి మిత్ర దేశాల వద్దకు వెళ్లామని.. అప్పులు అడిగామని.. ఆ సమయంలో తమకు సిగ్గుగా అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పులు తీసుకోవడం వల్ల ఆత్మగౌరవానికి పెద్దదెబ్బ ఎదురైందని షరీఫ్ పేర్కొన్నారు. అప్పులు ఇచ్చేవారు అనేక షరతులు పెట్టే వారిని.. అయినప్పటికీ తలవంచక తప్పలేదని షరీఫ్ వాపోయారు. అయితే కష్ట కాలంలో తమకు మద్దతు ఇచ్చిన చైనా, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
షరీఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శల వ్యక్తం అవుతున్నాయి. దేశంలో పేదరికం పెరిగిపోయిందని.. నిరుద్యోగం తారస్థాయికి చేరిందని.. నిరక్షరాస్యత కూడా అధికమవుతుందని.. ఇలాంటప్పుడు తెచ్చిన అప్పులు మొత్తం ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్న వారిలో పాకిస్తాన్ పౌరులే అధికంగా ఉండడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ మిత్ర దేశాల ఎదుట గొంతెమ్మ కోరికలను వ్యక్తం చేసింది. దీంతో చాలా వరకు దేశాలు అప్పుడు ఇవ్వడానికి కాస్త వెనకడుగు వేశాయి. ఇందులో సౌదీ అరేబియా కూడా ఉంది. ఇటీవల కాలంలో ఆర్థిక సహాయం చేయడానికి సౌదీ అరేబియా ముందుకు వచ్చినప్పటికీ.. పాకిస్తాన్ భారీగా రుణాలు అడగడంతో సౌదీ అరేబియా వెనకడుగు వేసింది.