Pakistan Economic Crisis 2026: పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. చమురు ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడి బడ్జెట్ తలకిందులు అవుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తారస్థాయికి చేరుకోవడంతో, దేశం పూర్తి స్థాయి లాక్‌డౌన్ అంచున నిలిచింది.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
ఇంధన ధరల విస్ఫోటనం..
పశ్చిమాసియాలోని యుద్ధ పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 30 శాతం పెరిగాయి. బ్యారెల్ ధర త్వరలోనే 100 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాకిస్తాన్‌లో పెట్రోల ధర రూ.55 పెరిగింది. డీజిల్ ధర రూ.55 పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర 35 శాతం పెరిగి రూ.5,135కు చేరింది.
అడుగంటుతున్న నిల్వలు..
ప్రస్తుతం పాకిస్తాన్‌లో 11 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. చమురు కొరత కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఉద్యోగుల పనిదినాలు తగ్గించింది. వర్క్‌ఫ్రం హోం అమలు చేస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇరాన్ దాడుల కారణంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలు ధ్వంసమయ్యాయి, ఉత్పత్తి ఆగిపోయింది. ఈద్, నౌరోజ్ సెలవుల కారణంగా ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో పాకిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం నెలకొంది.
లాక్‌డౌన్ దిశగా అడుగులు..
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు లాక్‌డౌన్ మినహా వేరే దారిలేదు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇంధన సంక్షోభం తీవ్రతను గుర్తించి, పలు కఠిన నిర్ణయాలు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి, ఆన్‌లైన్ తరగతులకు మార్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో 50% మందిని ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించారు. పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో వారం పని దినాలను 5 నుంచి 4 రోజులకు తగ్గించారు. మంత్రుల జీతాల్లో 20 శాతం కోత విధించారు. ప్రైవేట్ వాహనాల వినియోగంపై పరిమితులు విధించారు. ప్రభుత్వ వాహనాల ఉద్యమం తగ్గించారు.
జీడీపీకి భారీ దెబ్బ..
నిపుణుల అంచనాల ప్రకారం చమురు సంక్షోభం పాకిస్తాన్ జీడీపీని 2 నుంచి 3 శాతం దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింత పెరిగి, 40–45 శాతానికి చేరుకునే ప్రమాదం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఉద్యోగాలు, విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
దౌత్యపరమైన ప్రయత్నాలు
యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలు తీసుకుంటోంది. పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తోందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చింది. చైనా, సౌదీ అరేబియా నుంచి ఆర్థిక సహాయం కోరుతోంది. ఐఎంఎఫ్‌తో అత్యవసర చర్చలు జరుపుతోంది.
పాకిస్తాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇరాన్ యుద్ధం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయి కానీ, దీర్ఘకాలిక పరిష్కారం కాదు.