Afghanistan Russia Strategic Agreement: మూడున్నర దశాబ్దాల క్రితం సోవియట్ సేనలు అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి తగ్గడానికి ముల్లా ఒమర్ నేతృత్వంలోని ప్రతిఘటన ప్రధాన కారణం. ఇప్పుడు ఆయన కుమారుడు, ప్రస్తుత రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ ఒమర్ ముజాహిద్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గెయ్ షోయిగుతో కలిసి మే చివరి వారంలో మాస్కోలో సైనిక–సాంకేతిక సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందానికి ముందు రష్యా 2025 ఏప్రిల్‌లో తాలిబన్లను నిషిద్ధ ఉగ్రవాద జాబితా నుంచి తొలగించింది. జూలైలో ప్రపంచంలో తొలి దేశంగా అఫ్గాన్ ఇస్లామిక్ ఎమిరేట్‌ను అధికారికంగా గుర్తించింది.
ఒప్పందంలోని ప్రధాన అంశాలు..
రష్యా, అఫ్గాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఆర్థిక, శ్రామిక, రక్షణ రంగాల్లో విస్తృత సహకారాన్ని కలిగి ఉంది. తాలిబన్ పరిశ్రమల మంత్రి రష్యన్ కంపెనీలను లిథియం, రాగి, విలువైన రాళ్ల గనుల్లో పెట్టుబడి పెట్టమని ఆహ్వానించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యాలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని అధిగమించడానికి అఫ్గాన్ నుంచి కార్మికులు, నిపుణులను రష్యాకు తరలించే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది అఫ్గాన్‌కు కొంత ఆదాయం సమకూర్చే అవకాశం కల్పిస్తుంది.
ఉగ్రవాద నిరోధకతపై ఒప్పందం..
రష్యా అధినేత పుతిన్ గతంలోనే తాలిబన్‌ను ఈ పోరాటంలో భాగస్వామిగా ప్రకటించారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో 18 నుంచి 23 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారిలో మూడు వేల మంది ఐసిస్–కెకు చెందినవారని షోయిగు అంచనా వేశారు. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. భారత్ ఇప్పటికే ఏడాది నుంచి తాలిబన్ ప్రభుత్వంతో రహస్య సంప్రదింపులు కొనసాగిస్తోంది.
పాత సోవియట్ పరికరాల ఆధునికీకరణ..
ఒప్పందం ప్రకారం అఫ్గాన్‌లో ఉన్న పాత రష్యన్ హెలికాప్టర్లు, ట్యాంకులు, కవచ వాహనాల మరమ్మతు, నిఘా వ్యవస్థల ఆధునికీకరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీటికి అవసరమైన విడిభాగాలు రష్యా నుంచి సరఫరా అవుతాయి.
పాకిస్తాన్ ప్రాబలయ్యానికి దెబ్బ..
ఇంతకాలం అఫ్గాన్‌లోని పాత సోవియట్ ఆయుధాల నిర్వహణ కాంట్రాక్టులు పొందిన పాకిస్తాన్‌ను ఇది దెబ్బతీసే అవకాశం ఉంది. రష్యా అందించే సాంకేతిక సహాయం, డ్రోన్ నిఘా వ్యవస్థలు తాలిబన్ సైనిక సామర్థ్యాన్ని పెంచి, పాక్‌కు భద్రతా సవాలుగా మారవచ్చు. అఫ్గాన్‌పై పాక్ పాత వ్యూహాత్మక పట్టు బలహీనపడే ప్రమాదం ఉంది. రష్యా వంటి విశ్వసనీయ రక్షణ భాగస్వామి తాలిబన్‌తో సైనిక ఒప్పందం చేసుకోవడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. అఫ్గాన్ భూభాగం ద్వారా కశ్మీర్ కేంద్రిత ఉగ్రవాద సంస్థలకు ఆధునిక రష్యన్ సాంకేతికత, ఆయుధాలు చేరకుండా చూసుకోవడం ప్రధాన సవాల్.
రష్యా అఫ్గాన్‌లో పట్టు సాధించడంతో పాక్, చైనాల ప్రాబల్యం తగ్గితే, అది భారత్‌కు పరోక్షంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. చైనా అఫ్గాన్‌లో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. రష్యా సహకారంతో స్థిరత్వం నెలకొంటే ఆ పెట్టుబడులు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మధ్య ఆసియా ప్రాంతంలో రష్యా సైనిక ఆధిపత్యం చైనాకు పూర్తిగా నచ్చే అంశం కాదు.
