Homeఅంతర్జాతీయంIndia Bangladesh Relations: భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాల్లో కొత్త ఆశలు.. పర్యాటకులకు ఆహ్వానం!

India Bangladesh Relations: భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాల్లో కొత్త ఆశలు.. పర్యాటకులకు ఆహ్వానం!

India Bangladesh Relations: షేక్‌ హసీన ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. షేక్‌ హసీనాకు భారత్‌ ఆశ్రయం ఇచ్చిందన్న సాకుతో భారత్‌పై తాత్కాలిక ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. చైనా, పాకిస్తాన్‌తో సత్సంబంధాలు పెంచుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు భారత్‌ టూరిస్టు వీసాలను నిలిపివేసింది. ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇప్పుడిప్పుడే సంత్సంబంధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢాకాలోని భారత హైకమిషన్‌ జూన్‌ 28 నుంచి బంగ్లాదేశ్‌ పౌరుల టూరిస్ట్‌ వీసా దరఖాస్తులను స్వీకరించనుంది. హైకమిషనర్‌ దినేశ్‌ త్రివేది ఇండియన్‌ వీసా అప్లికేషన్‌ సెంటర్‌ను సందర్శించి ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి దశలో ఢాకా, రాజశాహి, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా నగరాల్లోని ఐదు కేంద్రాల ద్వారా సేవలు ప్రారంభమవుతాయి. తర్వాత ఈ సౌకర్యాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు ఉన్నాయి.

కొత్త హైకమిషనర్‌ కీలక చర్య..
దినేశ్‌ త్రివేది ఇటీవల బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహాబుద్దీన్‌కు అధికార పత్రాలు సమర్పించిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ చర్య రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత దృఢం చేయడమే లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

2024లో నిలిపివేత..
గత ఏడాది బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి తీవ్రంగా ఉంది. అప్పటి ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆ సమయంలో భారత దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో సాధారణ టూరిస్ట్‌ వీసాల జారీని నిలిపివేశారు. అయితే వైద్య చికిత్స, అత్యవసర కుటుంబ అవసరాలు, విద్య, వ్యాపారం కోసం పరిమిత వీసా సేవలు కొనసాగాయి.

ఇరు దేశాల మధ్య తగ్గనున్న ఉద్రిక్తతలు..
భారత్‌ బంగ్లాదేశ్‌ పౌరులకు అత్యధిక వీసాలు జారీ చేసే దేశాల్లో ఒకటి. కరోనా తర్వాత వీసా సేవలు పునరుద్ధరించినప్పటికీ రాజకీయ అశాంతి కారణంగా టూరిస్ట్‌ వీసాలపై నియంత్రణలు కొనసాగాయి. ఇప్పుడు ఈ సేవలు మళ్లీ ప్రారంభించడం ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నట్లు సూచిస్తోంది.

ఈ చర్య వల్ల పర్యాటకం, వాణిజ్యం, వైద్య సేవలు, విద్యా మార్పిడులు, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే వాణిజ్యం, భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి పెండింగ్‌ అంశాలపై సహకారం పెరగవచ్చు. మొత్తం మీద రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త దశకు నాంది పలుకుతుందని దౌత్య నిపుణులు భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version