Pakistan Army Chief: ఈ ఏడాది జూన్ నెలలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాలో పర్యటించారు. అప్పట్లో ఆయన పర్యటనకు సంబంధించి అమెరికాలో పాకిస్తాన్ ప్రవాసీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.”అమెరికాకు ఏ ముఖం పెట్టుకొని వచ్చావు.. అసలు ఈ దేశానికి ఎందుకు వచ్చావు.. వెంటనే వెళ్ళిపో” అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి అమెరికాలో ఒక దేశ సైనిక అధికారికి ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇదే తొలిసారి.
అంతటి నిరసనల మధ్య కూడా మునీర్ అమెరికాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మునీర్ కు అధికారికంగా విందు కూడా ఇచ్చారు. చాలా విషయాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. సరిగ్గా 2 నెలలు గడవక ముందే మళ్లీ ఇప్పుడు మునీర్ అమెరికాలో ప్రత్యక్షమయ్యారు. కొద్దిరోజుల పాటు ఆయన అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. మన దేశం మీద అగ్రరాజ్యం సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో.. మునీర్ అమెరికాలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ. కురిల్లా త్వరలోనే పదవి విరమణ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మునీర్ హాజరవుతారని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో అత్యంత విలువైన ఖనిజాలు బయటపడ్డాయని అమెరికన్ మీడియా తన కథనాలలో పేర్కొంది. అప్పటినుంచి అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ పాలకులకు దగ్గరయ్యారు. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇరుదేశాల అధినేతలతో మాట్లాడి.. యుద్ధాన్ని ఆపివేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత పాకిస్తాన్ పాలకులతో అంట కాగడం మొదలుపెట్టారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం శ్వేత దేశపు అధిపతి సంస్థలు పాకిస్తాన్లో ఉన్న ఖనిజాలను వెలికి తీస్తాయని తెలుస్తోంది. అందువల్లే ట్రంప్ పాకిస్తాన్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. పాకిస్తాన్ సైనిక అధికారి తో శ్వేత దేశ అధిపతి భేటీ కావడం.. ఆయనను అధ్యక్షుడి తరహలో గౌరవించడం సంచలనం కలిగిస్తోంది.
ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన కంపెనీ మనదేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. పాకిస్తాన్లో విలువైన ఖనిజాలు బయటపడిన నేపథ్యంలో.. వాటిని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే మునీర్ ను ట్రంప్ తన దగ్గరికి పిలిపించుకున్నాడని.. విపరీతమైన గౌరవం ఇస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలను భారత్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ అడ్వైజర్ చైనా అధినేతలతో భేటీ అయ్యారు. త్వరలో ప్రధాని చైనాలో పర్యటించబోతున్నారు. ఈ పరిణామాల కంటే ముందే మునీర్ పాకిస్తాన్ వెళ్లడం సంచలనం కలిగిస్తోంది.