Pakistan Terrorist Plot 2026: ఏప్రిల్.. ఈనెల భారతీయులందరికీ గుర్తుండే ఉంటుంది. గతేడాది ఏప్రిల్‌లో భారత్ కన్నీరు పెట్టిన మాసం. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి మరో 20 రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. ఈ విషాదాన్ని భారత్ మర్చిపోయిందనుకుంటున్న పాకిస్తాన్, మరో దుస్సాహసానికి సిద్ధమవుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘పాకిస్తాన్ దాడికి పాల్పడితే దీటుగా సమాధానం ఇస్తాం‘ అని స్పష్టం చేశారు.
గాయం ఇంకా మానలేదు
2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు 22 గంటలపాటు కోకర్నాగ్ అడవుల్లోంచి బైసరన్ లోయ వరకు ట్రెక్కింగ్ చేసి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ ’ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(టీఆర్‌ఎఫ్) ప్రకటించింది. ఇది లష్కర్–ఎ–తోయిబాకు అనుబంధ సంస్థ.
పాకిస్తాన్ కుట్రకు సంకేతాలు
ఏప్రిల్ 2026లో మరో పహల్గాం తరహా దాడికి పాకిస్తాన్ పన్నద్ధం అయ్యిందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు, ఐఎంఎఫ్ ఒత్తిడి, ధరల పెంపుతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ ఆగ్రహాన్ని మళ్లించేందుకు భారత్‌పై దాడికి కుట్ర చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్‌లో పాక్ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉండటంతో ఈ సమయాన్ని వాడుకుందామని పాకిస్తాన్ భావిస్తోంది.
బయటపడిన నిజం..
తాజాగా పాకిస్తాన్‌లో జరిగిన ఒక వీవీఐపీ పెళ్లిలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్–ఎ–తోయిబాకు పాక్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు బయటపడింది. షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ పెళ్లికి హాజరయ్యారు. లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కుమారుడు తలహార్ సయ్యిద్ కూడా హాజరయ్యాడు. రాణా సనావుల్లా ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంపీలు, మంత్రులు తలహార్ సయ్యిద్‌తో ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. హాఫిజ్ సయ్యిద్‌ను 31 ఏళ్ల జైలు శిక్ష పేరుతో జైలులో పెట్టినా, అడిగిన ప్రతీసారి బెయిల్ ఇస్తూ పాక్ ప్రభుత్వం ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తోందని ఈ సంఘటన నిరూపిస్తోంది.
భారత్ అప్రమత్తం..
రక్షణ వర్గాల సమాచారంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ ‘పాకిస్తాన్ భారత్‌పై దాడికి పాల్పడితే, దానికి దీటుగా, మరింత కఠినంగా సమాధానం ఇస్తాం. మా సైన్యం సిద్ధంగా ఉంది అని ప్రకటించారు. మరోవైపు భారత్ జమ్మూ–కశ్మీర్ సరిహద్దుల్లో నిఘాను పెంచింది. ఉగ్రవాద కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతుంది. సైనిక సిద్ధతను పెంచింది.
అమెరికా నివేదిక..
అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్‌ఆర్) 2025 డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో ‘2026లో భారత్–పాకిస్తాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు జరగనున్నాయి. 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు, ఆయుధాల పోటీ ఇందుకు కారణం’ అని తెలిపింది. భారత్ కూడా ఆపరేషన్ సిందూర్‌ను హోల్డ్‌లో పెట్టామని, అవసరమైనప్పుడు 2.0 మొదలు పెడతామని భారత్ హెచ్చరిస్తోంది.
పాకిస్తాన్ కుట్రలు ఏమైనా సరే, భారత్ అప్రమత్తంగా ఉంది. 2025 పహల్గాం దాడి తర్వాత భారత్ సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాద కదలికలపై నిరంతరం నిఘా ఉంది. పాకిస్తాన్ మరో దుస్సాహసానికి పాల్పడితే, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కంటే కఠినమైన సమాధానం సిద్ధంగా ఉంటుందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.
