Pakistan Economic Crisis: పాక్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇప్పట్లో బాగుంటుందని ఆశలు కూడా లేవు.. ఎప్పట్లో బాగుపడుతుందనే అంచనాలు కూడా లేవు.. ఈ విషయం తెలిసింది కాబోలు జపాన్ కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు సుజుకి, టయోటా పాక్ లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. పాక్ సుజుకి మోటార్స్ తన అసెంబ్లింగ్ ప్లాంట్ ను మూసివేసింది. పాక్ సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్ తో 1983లో జపాన్ కు చెందిన సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్ పాకిస్తాన్లోని పాకిస్తాన్ ఆటోమొబైల్ కార్పొరేషన్ తో జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేసుకుంది..తన అసెంబ్లింగ్ యూనిట్ ను ప్రారంభించింది. ఇదే సుజుకి మనదేశంలో మారుతి సుజుకి పేరుతో 1981లో భారత ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కార్యకలాపాలు ప్రారంభించింది.. అంతేకాదు సుజుకి మన దేశంలో ఎలాంటి మోడల్ విడుదల చేసినా.. అదే మోడల్ ను పాకిస్థాన్లో కూడా విడుదల చేసేది.. మనదేశంలో మారుతి వ్యాన్ అనే పేరుతో చెలామణి అయిన వ్యాన్… పాకిస్తాన్లో సుజుకి వ్యాన్ పేరుతో లాంచ్ అయింది.. కానీ పాకిస్తాన్లో కేవలం అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతూ వచ్చింది.. తప్పితే అక్కడ ఉత్పత్తి చేయలేదు. మొదట్లో మనదేశంలో జపాన్ నుంచి స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేసేది. కానీ తర్వాత కాలంలో పూర్తిస్థాయిలో మనదేశంలో తయారు చేయడం మొదలు పెట్టింది.. గత పది సంవత్సరాలుగా సుజుకి తన ఆటోమొబైల్ డిజైనింగ్ ను భారత్ లోనే చేస్తోంది.

ఆపేసింది
పాక్ లో తన అసెంబ్లింగ్ ప్లాంటును ఆపేయడానికి ప్రధాన కారణం డాలర్ల కొరత.. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఒక నెల వరకు అత్యవసర వస్తువులు దిగుమతి చేసుకొని వాటికి డాలర్ల రూపంలో చెల్లింపులు చేసేందుకు మాత్రమే నగదు రిజర్వు ఉన్నది.. గత మూడు సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ… ఎక్కడో ఒకచోట అప్పు పుట్టగానే మళ్లీ పూర్వ స్థితిలోకి వస్తోంది. గత ఆరు నెలలుగా పరిస్థితి మరింత దిగజారింది.. ఎంతో దిగుమతుల మీద పాకిస్తాన్ ఆంక్షలు విధించింది..ఇక పాక్ రూపాయి అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూ. 0.0044 గా ఉంది. ఒక డాలర్ విలువ పాకిస్తాన్ రూపాయలలో 277 గా ఉంది.. ఇక పాకిస్తాన్ లో సుజుకి మోటార్స్ కు విడిభాగాల కొరత ఉంది.. జపాన్ లోని తన మాతృ సంస్థ నుంచి విడిభాగాలు దిగుమతి చేసుకోవాలంటే దానికి పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి.. ఎందుకంటే దిగుమతి చేసుకున్న విడిభాగాలకి డాలర్ రూపంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అక్కడ అన్ని డాలర్లు లేవు కాబట్టి సుజుకి విడిభాగాల దిగుమతి కోసం అనుమతి కోరితే మూడు నెలల నుంచి ఎటువంటి పురోగతి లేదు. గత మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో సుజుకి ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇస్తోంది. దీనికి విద్యుత్, గ్యాస్ కొరత కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత అదుపుతప్పింది. మరోవైపు విడిభాగాలు, విద్యుత్, గ్యాస్ లభ్యమయి, కారు అసెంబ్లింగ్ అయ్యి షోరూమ్ కు వెళ్ళినా రెండేళ్ల క్రితం కంటే మూడు రెట్లు ధర ఎక్కువగా చెల్లించి కొనాల్సి ఉంటుంది.. ఆ స్థాయిలో డబ్బు వెచ్చించి కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ ప్రజలు సిద్ధంగా లేరు.. ఈ పరిస్థితులను గమనంలో పెట్టుకొని సుజుకి మోటార్స్ తన అసెంబ్లింగ్ యూనిట్ ను శాశ్వతంగా మూసివేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది.

టయోటా కూడా..
ఇక జపాన్ కు చెందిన మరో ఆటో దిగ్గజ కంపెనీ టయోటా పాకిస్థాన్లో ఇండస్ మోటార్స్ పేరుతో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.. అయితే గత డిసెంబర్ నెలలో ఆ కంపెనీ తన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. సుజికి ఎలాంటి ఇబ్బందులు పడుతోందో, టయోటా కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది.పైగా సుజుకి కంటే టయోటా కార్ల ధరలు అధికం. ఇక పాక్ లో ట్రాక్టర్లను అసెంబ్లింగ్ చేయించే మిల్లెట్ ట్రాక్టర్స్ కూడా తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. ఎందుకంటే ఆ కంపెనీ తయారు చేసిన ట్రాక్టర్లు అమ్ముడుపోవడం లేదు.. పైగా పాక్ రూపాయి డాలర్ తో పోలిస్తే చాలా బలహీనంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కంపెనీ ట్రాక్టర్ ధరలు పెంచింది.. దీంతో అమ్మకాలు పడిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ లో పరిస్థితులపై ఒక పుస్తకమే రాయవచ్చు. కానీ ఆ దేశం మారదు. మార్చుకోవాలని కూడా అనుకోదు.