Pakistan Afghanistan War: ఇస్లామిక్ దేశమైన ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులతో విచురుకుపడింది. ఆఫ్గాన్‌లో తెహ్రీక్ – ఇ – తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని, వారు పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్నారన్న సాకుతో ఈ దాడులు చేసింది. అయితే ఆఫ్గాన్ వద్ద వైమానిక దళం లేకపోవడంతో రెండు రోజులు ఓపిక పట్టింది. కానీ పాకిస్తాన్ దాడులు ఆపకపోవడంతో ఆఫ్గాన్ కూడా పాకిస్తాన్‌పై ప్రతిదాడి ప్రారంభించింది. భారీగా పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకుంది. ఈ క్రమంలో పాక్–ఆఫ్గాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు, రక్తపాతం తాత్కాలిక యుద్ధవిరమణ ఒప్పందానికి దారితీసిన తర్వాత ఇప్పుడు దోహాలో కీలక చర్చల దశకు చేరాయి.
దోహాలో సమావేశం..
రెండు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 17న ఖతార్‌లో సమావేశమయ్యారు. ఆఫ్గాన్ రక్షణ మంత్రి ముల్లా ముహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆధ్వర్యంలో తాలిబాన్ బృందం పాల్గొంది. పాకిస్తాన్ తరపున సీనియర్ భద్రత, ఇంటెలిజెన్స్ అధికారులు హాజరయ్యారు. సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలను శాంతి మార్గంలో పరిష్కరించడం, కొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం, భవిష్యత్ సైనిక చర్యలను నివారించడంపై చర్చింరాఉ.
చర్చల్లో ప్రతిష్టంభన..
9 అక్టోబర్ నుంచి కరాచీ–కందహార్ సరిహద్దు వెంబడి జరిగిన భారీ ఘర్షణలతో రెండు దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్ ప్రాంతాల్లో తహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) శిబిరాలపై వైమానిక దాడులు జరిపిందని నివేదికలు తెలిపాయి. ఈ దాడులకు ప్రతిగా ఆప్గాన్ తాలిబాన్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసింది. రెండు దేశాలు పరస్పరం దాడులు ప్రారంభించారంటూ ఆరోపణలు చేసుకున్నాయి, పౌరుల ప్రాణనష్టాలు కూడా సంభవించాయి.
శాంతికి చివరి అవకాశమా?
ఖతార్ ప్రభుత్వమే ఈ చర్చలకు ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరించింది. పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, కతార్ ఎమిర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ‘‘ఖతార్ ఎల్లప్పుడూ ప్రాంతీయ స్థిరత్వానికి కృషి చేస్తోంది’’ అని అన్నారు. ఖతార్ విదేశాంగ మంత్రి అబ్దులాజీజ్ అల్ ఖులైఫి, ‘‘రెండు దేశాలు సహనం పాటించి శాంతి మార్గంలో నడిస్తే, దీర్ఘకాల స్థిరత్వం సాధ్యమే’’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 17న ప్రకటించిన ప్రకారం, రెండు దేశాలు 48 గంటల యుద్ధవిరమణ పరిమితిని చర్చల ముగిసే వరకు పొడిగించేందుకు అంగీకరించాయి. ఈ తాత్కాలిక విరమణ వల్ల సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలిక శాంతి నెలకొంది. అయితే, చర్చల ఫలితం ఆధారంగా అది స్థిరమవుతుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
దోహా చర్చలు కేవలం పాకిస్తాన్–ఆప్గాన్ సమస్య మాత్రమే కాకుండా దక్షిణాసియా భద్రతా వాతావరణానికి కూడా కీలకం. ‘‘పాకిస్తాన్ అంతర్గత సంక్షోభాలు, ఆర్థిక దివాళా స్థితి, అంతర్జాతీయ ఒత్తిడులు దోహా చర్చలపై ప్రభావం చూపుతాయి. మరోవైపు, తాలిబాన్ పాలనలో ఆప్గాన్ దౌత్య విధానం స్థిరంగా లేకపోవడం కూడా ప్రధాన అడ్డంకి. ఈ చర్చలు విజయవంతమైతే, పాకిస్తాన్–ఆఫ్ఘాన్ సరిహద్దు భద్రత, వాణిజ్య మార్గాల పునరుద్ధరణ, ఉగ్రవాద నిరోధక చర్యల్లో కొంత స్థిరత్వం తేవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. లేకపోతే, రెండు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ విస్తరించే అవకాశం ఉంది.