Mopidevi Venkataramana: ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఒక వెలుగు వెలిగారు మోపిదేవి వెంకటరమణ( mopidevi Venkat Ramana) . బీసీ నాయకుడిగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. కానీ ఇప్పుడు టిడిపిలో ఒక అనామక నాయకుడిగా మిగిలిపోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. కానీ ఆయనకు ఎక్కడా ప్రాధాన్యత లేదు. దీంతో ఆయన తొందర పడ్డారా అన్న చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగిపోయిన మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కిందట టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే టిడిపిలో చేరి ఏడాది అవుతున్నా ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
* బీసీ సామాజిక వర్గం..
అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004లో మాత్రం గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తో ఏర్పడిన రేపల్లె నియోజకవర్గం నుంచి 2009లో గెలిచారు. 2014, 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కానీ అంతకంటే ముందే ఎమ్మెల్సీ ని చేసి మంత్రిగా అవకాశం ఇచ్చారు. కొద్దిరోజులకే రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించారు. కానీ 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు మోపిదేవి. గత ఏడాది అక్టోబర్ లో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
* వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో..
మోపిదేవి వెంకటరమణ జగన్( Y S Jagan Mohan Reddy ) అక్రమాస్తుల కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు. జగన్ తో పాటు జైలు జీవితం గడిపారు. ఆ సాన్నిహిత్యం తోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ రెండుసార్లు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మూడోసారి జగన్ చాన్స్ ఇవ్వలేదు. అందుకే మోపిదేవి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఆయన ఎమ్మెల్సీ హామీతోనే టిడిపిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే రేపల్లె నియోజకవర్గం లో ఆయన చేయి పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ మోపిదేవి వెంకటరమణ వైపు ఎటువంటి సౌండ్ లేదు. కానీ చంద్రబాబుతో పాటు లోకేష్ తనకు న్యాయం చేస్తారని మోపిదేవి ఆశతో ఉన్నారు. మరి ఎలాంటి పదవి ప్రకటిస్తారో చూడాలి.