Overseas Highway : 20వ శతాబ్దం ప్రారంభంలో, ఫ్లోరిడా(Florida) కీస్(kees)లోని ద్వీపాలకు చేరుకోవాలంటే పడవలు తప్ప వేరే దారి లేదు. సముద్రం ఆటుపోట్లతో రోజంతా ప్రయాణించాల్సిన ఆ మార్గం ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది. కానీ ఒక మనిషి ఈ కష్టాలను చూసి, వాటిని అధిగమించాలనే సంకల్పం తీసుకున్నాడు. ఆయన పేరు హెన్రీ మోరిసన్ ఫ్లాగ్లర్(Henry Morisan Flaglar), ఒక దూరదృష్టి గల డెవలపర్, ఎవరో ఒకరు ‘ది ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఫ్లోరిడా‘ అని పిలిచారు. ఫ్లాగ్లర్ కల ఏమిటంటే మయామి నుంచి కీ వెస్ట్ వరకు సముద్రం మీద ఒక రైలుమార్గం నిర్మించడం. 44 ద్వీపాలను 42 వంతెనలతో కలిపే ఈ ఆలోచన అప్పట్లో అసాధ్యంగా అనిపించింది. కానీ అతని దృఢసంకల్పం ముందు సముద్రం కూడా తలవంచింది. 1912లో ఓవర్–సీ రైల్‌రోడ్ పూర్తయింది. ఈ రైలుమార్గాన్ని అప్పట్లో ‘ప్రపంచంలోని ఎనిమిదో వింత‘(World 8th Wonder)గా పిలిచారు. తొలి రైలులో ప్రయాణించిన 82 ఏళ్ల ఫ్లాగ్లర్, తన స్నేహితుడితో ‘ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను, నా కల నెరవేరింది‘ అని చెప్పాడు. అతని ఆనందం అంతా ఆ రైలు పట్టాల్లో ప్రతిధ్వనించింది.
తుఫాను దెబ్బ
కానీ ఈ కల ఎక్కువ కాలం నిలవలేదు. 1935లో, శతాబ్దంలోనే అత్యంత ఘోరమైన తుఫాను(cyclone) ఈ రైలుమార్గాన్ని ధ్వంసం చేసింది. కొన్ని మైళ్ల ట్రాక్‌లు సముద్రంలో కలిసిపోయాయి. ఫ్లాగ్లర్ కల శిథిలమైందని అంతా అనుకున్నారు. కానీ అమెరికన్లు దాన్ని అలా వదిలేయలేదు. ఆ సమయంలో అమెరికా ఆటోమొబైల్స్ యుగంలోకి అడుగుపెడుతోంది. రైలుమార్గాన్ని పునర్నిర్మించడం కంటే, దాన్ని రహదారిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లాగ్లర్ వంతెనలు గంటకు 200 మైళ్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే బలంతో ఉండటం వల్ల, వాటి మీదే కొత్త రహదారి నిర్మాణం ప్రారంభమైంది. 1938లో ఈ ప్రాజెక్ట్ మొదలై, తర్వాత సంవత్సరాల్లో అభివృద్ధి చెందింది. రైలు ట్రాక్‌లు కార్ల కోసం రహదారులుగా మారాయి. ఇలా జన్మించింది ఓవర్సీస్ హైవే.
ఫ్లోరిడా కీస్‌కు కొత్త జీవం
ఈ రహదారి కేవలం రవాణా సౌలభ్యం మాత్రమే కాదు, ఫ్లోరిడా కీస్‌ను పర్యాటక కేంద్రంగా మార్చిన ఒక వరం. నీలి సముద్రం మధ్యలో 42 వంతెనలతో, 44 ద్వీపాలను కలుపుతూ, ఈ 113 మైళ్ల రహదారి ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. హైదరాబాద్ నుంచి కోదాడ వరకు దూరంతో సమానమైన ఈ మార్గం, ఒకప్పుడు రోజంతా పడవల్లో ప్రయాణించాల్సిన అవసరాన్ని గంటల వ్యవధిలో సులభమైన డ్రైవ్‌గా మార్చేసింది.
నీటిపై తేలియాడే కల
ఇది నిజానికి ‘తేలియాడే రహదారి‘ కాకపోయినా, సముద్రం మీద విస్తరించిన దృశ్యం చూస్తే అలాగే అనిపిస్తుంది. ఫ్లాగ్లర్ దూరదృష్టి, అమెరికన్ ఇంజనీరింగ్ నైపుణ్యం కలిసి ఈ రహదారిని సృష్టించాయి. ఇప్పుడు, ఈ ఓవర్సీస్ హైవే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తూ, ఫ్లోరిడా కీస్‌కు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఇది కేవలం రహదారి కథ కాదు ఒక మనిషి కల, సముద్రం సవాలు, మరియు మానవ సంకల్పం విజయం కథ.