Mark Rutte: ఇటీవల ప్రకటించిన ఓ రాష్ట్ర ఎన్నికల ఫలితాలలో అధికార పార్టీ ఓడిపోయింది. అన్ని రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వెళ్తూ వెళ్తూ ప్రభుత్వ ఫర్నిచర్ తీసుకుపోయారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి డబ్బు కట్టిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పడం సంచలనం కలిగించింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఇలా ఉంటుందా.. ప్రభుత్వ సొమ్మును నాయకులు వాడుకోవడమేంటనే ప్రశ్న ప్రజాస్వామ్య బుద్ధి జీవుల్లో ఉత్పన్నమైంది. అయితే ఓ దేశానికి ప్రధాన మంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన ఓ వ్యక్తి.. తన ప్రభుత్వానికి అధికారం దక్కకపోవడంతో.. చాలా నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. సైకిల్ తొక్కుకుంటూ సాధారణ మనిషిలాగా తన నివాసానికి తిరుగు ప్రయాణం కొనసాగించాడు. ప్రజాస్వామ్యం పేరుతో అడ్డగోలుగా దోచుకుని.. తరాలకు సరిపడా దాచుకుని.. రాజకీయం అంటేనే అనేక వికృతాలకు మార్గంగా మార్చిన రాజకీయ నాయకులు ఆ ప్రధాన మంత్రి గురించి తెలుసుకోవాలి. జీవితంలో ఒక్కరోజైనా అతనిలా బతకాలి.
యూరప్ లోని ఓ దేశమైనా నెదర్లాండ్స్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ దేశ ప్రధానిగా డిక్ స్కూప్ ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మార్క్ రుట్టె తన పదవికి రాజీనామా చేశారు. బాధ్యతలు అప్పగించి.. తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో అందరి నేతల్లా కాకుండా.. సాధారణ పౌరుడి లాగా సైకిల్ మీద వెళ్లిపోయారు. సైకిల్ నడుపుకుంటూ.. తన భద్రతా సిబ్బందికి టాటా చెబుతూ వీడ్కోలు పలికారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇక ఈ వీడియోను పుదుచ్చేరి మాజీ గవర్నర్ కిరణ్ బేడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజెన్లు అభినందనలు జల్లు కురిపిస్తున్నారు. అధికార మార్పిడి ఇంత శాంతియుతంగా జరగడం గొప్ప విషయమని అభివర్ణిస్తున్నారు. ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెబుతున్నారు.
నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 2010లో రుట్టె బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 14 సంవత్సరాలపాటు ఏకచత్రాధిపత్యంగా పదవిలో కొనసాగారు. అయితే నెదర్లాండ్స్ దేశంలోకి వలసలు నియంత్రించే విధానంపై సంకీర్ణ ప్రభుత్వంలో ఒక అంగీకారం సాధ్యం కాలేదు. ఫలితంగా గత ఏడాది జులైలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అయితే అప్పట్లోనే రుట్టే తన పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక గత ఏడది చివరిలో నెదర్లాండ్స్లో ఎన్నికలు నిర్వహించారు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో.. మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ప్రధాని పదవికి సంబంధించి అవగాహన కుదరకపోవడంతో ఇన్ని రోజులపాటు ఆలస్యం జరిగింది. చివరికి డిక్ స్కూప్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
After 14 years in power, this is how former Dutch Prime Minister Mark Rutte left the Prime Minister’s Office after completing the ceremony of officially handing over power to his successor, Dick Schoof.#netherlands pic.twitter.com/exux8saX0D
— Kiran Bedi (@thekiranbedi) July 6, 2024