Nepal Protests: మామూలు ఆగ్రహం కాదది. మామూలు ఆవేశం కాదది. అవినీతి తొలగిపోవాలి. బంధుప్రీతి నశించిపోవాలి. మెరుగైన పరిపాలన కావాలి. స్వచ్ఛమైన రాజకీయాలు కావాలి. అందుకోసమే మా పోరాటం. దానికోసమే మా ఆరాటం. మా గొంతులు నొక్కుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి పరిపాలన మాకొద్దు. ఇటువంటి వ్యక్తులు మాకొద్దు. ఇటువంటి వ్యక్తులు లేని ప్రాంతమే మాకు ముద్దు. స్వచ్ఛమైన నేపాల్ మాకు కావాలి. దానికోసం ఎక్కడి దాకైనా వెళ్తాం. ఎంత దాకా అయినా వెళ్తాం. చివరికి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. నేపాల్ బాగుండాలి. మా మాతృగడ్డ గొప్పగా అభివృద్ధి చెందాలి. అదే మా తాపత్రయం. అదే మా ఆశయం.. ఇదిగో గత రెండు రోజులుగా నేపాల్ దేశంలో అక్కడి యువతరం ఇలాగే మాట్లాడుతోంది. ఇదే స్థాయిలో ఉద్యమాలు చేస్తోంది. చివరికి తాము అనుకున్నది సాధించింది…
నేపాల్ దేశంలో రాజుకున్న చిచ్చు ఈరోజు ఏకంగా పార్లమెంట్ భవనానికి వ్యాపించింది. అక్కడి నిరసనకారులు పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. అంతేకాదు ప్రధానమంత్రిని దేశం విడిచి వెళ్లిపోయేలా చేశారు. మంత్రులను నడివీధిలో ఉరికిచ్చుకుంటూ కొట్టారు. ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పాడేల్ ను నడివీధిలో పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రాణ భయంతో ఆయన పారిపోతుండగా మరీ చితకబాదారు. ఆందోళనకారుల పోరాటం వల్ల ఆ దేశంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు మొత్తం నేపాల్ దాటి వదిలి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది..
ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో దానిని అధ్యక్షుడు ఆమోదించారు. దీంతో నేపాల్ మొత్తం సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయింది. సైన్యం ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కాపలా కాస్తోంది. మరోవైపు నిషేధ ప్రాంతాలను సైతం ఆందోళనకారులు చుట్టుముట్టారు. పెను విధ్వంసం సృష్టించారు. తమకు స్వచ్ఛమైన పరిపాలన కావాలని డిమాండ్ చేశారు. నేపాల్ పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. అక్కడ సామాజిక మాధ్యమాల మీద నిషేధం విధించినప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఆ దేశ పరిపాలకుల మీద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అక్కడ ఉదృతంగా జరుగుతున్న అల్లర్లు, ఆందోళనలను ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. త్వరలోనే అక్కడ ప్రశాంత పరిస్థితి ఏర్పడాలని కోరుతున్నాయి.