Hassan Nasrallah : హెజ్ బొల్లా చీఫ్ గా నస్రల్లా బయటి ప్రపంచానికి కనిపించడు. అతడు బయటికి రావడమే చాలా అరుదు..పైగా హెజ్ బొల్లా ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హెజ్ బొల్లా అనేది లెబనాన్ ప్రాంతానికి చెందిన సంస్థ.. 1980లో లెబనాన్ లో అంతర్యుద్ధం జరిగింది. ఆ సమయంలోనే ఈ మిలిటెంట్ గ్రూప్ ఆవిర్భవించింది.. అనంతరం ఇరాన్ అండదండలు అందించడంతో అందనంత ఎత్తుకు ఎరిగింది. ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకు లేనటువంటి ఆయుధాలు, ఆర్థిక వనరులు ఈ సంస్థకు ఉన్నాయి. ఈ సంస్థ వద్ద లక్ష రాకెట్లు ఉన్నాయి.. 50 వేల నుంచి లక్ష వరకు అన్ని రంగాలలో శిక్షణ పొందిన ఫైటర్లు ఉన్నారు. అందువల్లే హెజ్ బొల్లా పదేపదే ఇజ్రాయిల్ దేశంపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇక గత అక్టోబర్లో ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు చేసింది. ఆ దాడులు అనంతరం పాలస్తీనాకు సంఘీభావంగా నిత్యం ఇజ్రాయిల్ దేశంపై రాకెట్లను వదిలేది. అయితే కొద్ది రోజుల క్రితం హెజ్ బొల్లా గ్రూప్ వదిలిన ఒక రాకెట్ ఇజ్రాయిల్ లోని ఓ పాఠశాల పిల్లలపై పడింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. అప్పటినుంచి ఇజ్రాయిల్ హెజ్ బొల్లా ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.
ముందుగా హెజ్ బొల్లా ముఖ్య నాయకుల పై దృష్టి సారించింది. ఫహద్ షుకుర్, ఇబ్రహీం అఖిల్ వంటి వారిని వైమానిక దాడులు చేసి చంపేసింది. ఇక అప్పట్నుంచి నస్రల్లా అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఇజ్రాయిల్ నిఘా విభాగం అత్యంత బలమైనది.. తనకున్న విశ్వసనీయమైన వ్యక్తుల ద్వారా లెబనాన్ లో ఏం జరుగుతుందో నిత్యం తెలుసుకునేది. ఇందులో భాగంగా కొద్దిరోజులు కిందట పేజర్లు, వాకి టాకీలలో బాంబులు ఏర్పాటు చేసి వేలాదిమంది ఫైటర్లను గాయపడేలా చేసింది. ఇందులో కొంతమంది కన్నుమూశారు. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ పై ఇజ్రాయిల్ ఇంతవరకు నోరు మెదపలేదు.
కాగా, నస్రల్లా బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించడు. వీడియోలు, ఇతర మార్గాల ద్వారానే తన సందేశాలు ఇస్తాడు .. 32 సంవత్సరాలుగా అతడు
హెజ్ బొల్లా సారధిగా ఉన్నాడు. ఎంతోమందిని ఫైటర్లుగా తీర్చిదిద్దాడు. అతడు బీ రూట్ లోని అతిపెద్ద భవనాల కింద ఏర్పాటు చేసిన సెల్లార్లలో నివాసం ఉంటాడని తెలిసింది. అయితే ఈ సమాచారం ఇజ్రాయిల్ నిఘా విభాగానికి తెలిసింది. దీంతో అమెరికా తయారుచేసిన బంకర్ బస్టర్ బిబియు 28 ని ఇజ్రాయిల్ కొనుగోలు చేసింది. దానిని రంగంలోకి దింపింది. నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడమే ఆలస్యం బీ రూట్ లోని బహుళ అంతస్తులు లోకి ఆ బాంబు ప్రవేశించింది. ఆ భవనాలను పడగొట్టింది. ఈ ప్రమాదంలో నస్రల్లా దుర్మరణం చెందాడు.. కాగా 2006లో హెజ్ బొల్లా – ఇరాన్ మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఆ సమయంలో ఇజ్రాయిల్ ప్రభుత్వం ఐడిఎఫ్ దళాలను లెబనాన్ నుంచి వెనక్కి తీసుకురావలసి వచ్చింది. అనంతరం ఇజ్రాయిల్ ఐరన్ డోమ్, క్షిపణులు, యుద్ధ విమానాలు.. ఇతర పరికరాలను సొంతం చేసుకుంది. రక్షణ సంబంధిత పరికరాలను అమ్మడం మొదలు పెట్టింది. టెక్నాలజీ పై విపరీతమైన పట్టు సాధించింది. లక్ష్యాలపై పకడ్బందీగా దాడులు చేయడం మొదలుపెట్టింది. అయితే గత అక్టోబర్లో ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం తెలుసు కాబట్టి హమాస్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ హెజ్ బొల్లా ముందు చూపు లేకుండా ఇజ్రాయిల్ పైకి వచ్చింది. కానీ ఇజ్రాయిల్ తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెజ్ బొల్లా గ్రూప్ కు చుక్కలు చూపించింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More