Homeఅంతర్జాతీయంNRI News : మరణమే దిక్కు.. కువైట్లో తెలుగోడి అరణ్య రోదనకు స్పందించిన మంత్రి లోకేష్

NRI News : మరణమే దిక్కు.. కువైట్లో తెలుగోడి అరణ్య రోదనకు స్పందించిన మంత్రి లోకేష్

NRI News : మనదేశంలో ఉపాధికి తగ్గ వేతనం దొరకడం కష్టం. అందుకే ఎక్కువమంది ఉపాధిని వెతుక్కుంటూ విదేశాలకు వెళుతుంటారు. విదేశాల్లో ఉద్యోగం పేరిట దళారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. విదేశీ ఉద్యోగాల పేరిట వల విసురుతుంటారు. వారు చెప్పిన ఉద్యోగం ఒకటి. అక్కడికి వెళ్ళాక అప్పగించే ఉద్యోగం మరొకటి. దీంతో వేలాదిమందికి నరకయాతన తప్పడం లేదు. ముఖ్యంగా ఎడారి నగరాల్లో చిక్కుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అవస్థలు పడుతున్నారు. ఇలా చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారు ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అటువంటి వ్యక్తి ఆర్తనాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో ఇంటర్నెట్ వ్యవస్థ లేదు. కాబట్టి వారి బాధలు ఎవరికీ వినిపించేవి కావు. ఇప్పుడు అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. 5జి నెట్వర్క్ తో క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తమ బాధను వ్యక్తం చేసి ఎక్కువమంది సోషల్ మీడియాలో సహాయాన్ని అర్ధిస్తున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళుతున్న చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా పెద్దదిక్కుగా నిలుస్తుంది. తాజాగా ఓ వ్యక్తి తన బాధను వ్యక్తపరుస్తూ ఓ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

అయితే ఆ వీడియోలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తపరుస్తూ అక్కడున్న పరిస్థితులకు కళ్లకు కట్టినట్టు తెలిపాడు. అంతేకాకుండా అక్కడ కనీసం సేదతీరడానికి చెట్లు, తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. బతుకంతా కుక్కలు, పిల్లులు, బాతులకు ఆహారం పెట్టడమే నా పని అంటూ తన ఆవేదనను వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. కనీసం ఈ ఎడారి చుట్టూ ఎవరూ కూడా కనిపించారని.. కనీసం మాట్లాడుకోవడానికి పక్కన ఒక్క వ్యక్తి కూడా కనిపించడని కన్నీటి పర్యంతమయ్యాడు. తనని ఈ దేశానికి తీసుకువచ్చిన ఏజెంట్ కి ఫోన్ చేస్తే స్పందించడం లేదని చెప్పుకొచ్చాడు. ఇంకో విషయం ఏమిటంటే తన బాధను చెప్పుకుంటున్న భార్య కూడా పట్టించుకోవడంలేదని ఆ వ్యక్తి చెబుతుండడం విశేషం.

ప్రతిరోజు చస్తూ బతుకుతున్నానని..ఇక తన వల్ల కాదని.. తన బాధని అర్థం చేసుకుని విముక్తి చేయాలని వేడుకుంటున్నాడు. ఎవరూ పట్టించుకోకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని కూడా హెచ్చరిస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై మంత్రి లోకేష్ స్పందించారు. విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. కువైట్ లోని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగంతో కూడా సంప్రదించారు. బాధితుడ్ని వీలైనంత త్వరగా విముక్తి కల్పించాలని సూచించారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం క్యాబినెట్లో విదేశీ వ్యవహారాల కోసం ఒక శాఖను కేటాయించింది. ఉద్యోగ ఉపాధి కోసం వేట వేలాదిమంది తెలుగు ప్రజలు విదేశాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో చిక్కుకుంటారు. మరికొందరు మోసపోతుంటారు. అటువంటి వారిని స్వస్థలాలకు రప్పించేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. వీటిని దృష్ట్యా విదేశీ వ్యవహారాల శాఖను క్రియేట్ చేశారు. దానికి ప్రత్యేకంగా ఒక మంత్రిని కేటాయించారు. గత ప్రభుత్వంలో విదేశాల్లో చిక్కుకున్న వారి విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. వారిని స్వస్థలాలకు రప్పించడంలో జాప్యం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకూడదని టిడిపి ప్రభుత్వం ప్రత్యేకంగా విదేశీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయడం విశేషం. తాజాగా మంత్రి లోకేష్ సైతం వేగవంతంగా స్పందించడం, కువైట్ లోనే తమ పార్టీకి చెందిన ఎన్నారై విభాగాన్ని అప్రమత్తం చేయడం అభినందనలు అందుకుంటోంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular