Miss Telugu USA-2025
Miss Telugu USA-2025 : అగ్రరాజ్యం అమెరికాలో వేల మంది తెలుగువారు విద్య, ఉదో‍్యగం, ఉపాధి కోసం స్థిరపడ్డారు. అక్కడ కూడా తెలుగుదనం చాటుతున్నారు. పండుగలు, వేడుకలు, ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చదువుతోపాటు వివిధ పోటీల్లో పాల్గొని మెరుస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా తెర్లాం మండలం సోమిదవలస గ్రామానికి చెందిన చందక సాయిసాత్విక అమెరికాలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ‘మిస్ తెలుగు యూఎస్ఏ-2025’ పోటీల్లో సత్తా చాటింది. తుది దశకు చేరుకుంది. ఎమ్మెస్సీ (డేటా అనలిటిక్స్) చదవడానికి డల్లాస్ వెళ్లిన ఈ యువతి, చదువుతో పాటు తన అందం, ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన ఈ పోటీల్లో 300 మంది తెలుగు యువతులతో తలపడి ఫైనల్స్‌కు ఎంపికై, గ్రామస్తుల్లో ఆనందం నింపింది. మే 25న డల్లాస్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో ఆమె విజేతగా నిలవాలని ఆశిస్తోంది.
Also Read : 5 రోజుల్లో 200 కోట్లు..ఓవర్సీస్ లో ‘L2 : ఎంపురాన్’ సరికొత్త బెంచ్ మార్క్
ఏపీలో విద్యాభ్యాసం..
సాయిసాత్విక తండ్రి చందక సూర్యకుమార్ మెకానికల్ ఇంజినీర్, తల్లి సబిత రేషన్ డీలర్. ఆమె ప్రాథమిక విద్య రాజాంలోని సెంటైన్స్ పాఠశాలలో, బీఎస్సీ అగ్రికల్చర్ బాపట్ల వ్యవసాయ కళాశాలలో పూర్తిచేసింది. అమెరికాలో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అక్క సాయిసుస్మిత దగ్గర ఉంటూ ఈ పోటీల్లో పాల్గొంది. చిన్నప్పటి నుంచి వ్యాసరచనల్లో బహుమతులు గెలుచుకున్న సాయిసాత్విక, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కావాలనే కలను కన్నది.
ఓటువేసి గెలిపించాలని వినతి..
సోషల్ మీడియా ద్వారా భారతీయులందరికీ ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తోంది. తల్లి సబిత మాట్లాడుతూ, కుమార్తె సాధించిన ఈ విజయం తమ కుటుంబానికి గర్వకారణమని, ఫైనల్స్‌లో ఆమె గెలుపొందేందుకు అందరూ సహకరించాలని కోరారు. సాయిసాత్విక ప్రతిభ, అందం తెలుగు సంఘంలోనే కాక, అమెరికా వేదికపైనా మెరుస్తోంది. ఈ యువతి విజయం సాధిస్తే, తెలంగాణకు, ముఖ్యంగా సోమిదవలసకు అది ఒక చిరస్థాయి గుర్తింపుగా నిలుస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ పోటీలో ఆమె విజయం కోసం తెలుగు సమాజం ఏకమై, ఓట్ల రూపంలో మద్దతు తెలపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సాయిసాత్విక ప్రయాణం యువతకు స్ఫూర్తిగా నిలిచి, తెలుగు సంస్కృతిని అంతర్జాతీయంగా చాటే అవకాశంగా మారనుంది.
Also Read : అమెరికా ప్రతీకార సుంకాలు.. భారత్‌పై కీలక నిర్ణయం!