Bosnia War: మనిషి.. ఈ భూమ్మీద అత్యంత తెలివైన వాడు.. మిగతా జంతువులను హద్దు అదుపులో పెట్టుకునే సత్తా మనిషి సొంతం. చివరికి ప్రకృతిని సైతం తనకు తగ్గట్టుగా మార్చుకోవడం.. మలచుకోవడం కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. అయితే ఇంతటి గొప్ప మేధస్సు ఉన్న మనిషి.. సాటి మనిషి మీద మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటాడు. అత్యంత కర్కషంగా వ్యవహరిస్తుంటాడు. ఇటువంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఇప్పుడు మీరు చదువుతున్న కథనం మాత్రం అత్యంత దారుణమైనది. సరిగా 30 సంవత్సరాల క్రితం జరిగిన ఈ దారుణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఐరోపా ఖండంలో బోస్నియా (bosnia war) నరమేధం చోటు చేసుకుంది. 1992 నుంచి 1995 మధ్య యుద్ధం జరిగింది.. నాడు జరిగిన ఈ దారుణంలో సంపన్నులు అత్యంత ఘోరాలకు పాల్పడ్డారు. నాడు చోటు చేసుకున్న ఘోరాలపై ఇటలీ ప్రభుత్వం దర్యాప్తు మొదలు పెట్టింది. ఐరోపా ఖండం చరిత్రలో ఇది అత్యంత హింసాత్మక ఘటనగా నిలిచింది. 1992 సంవత్సరం ప్రారంభంలో బోస్నియా – హర్జే గోవినా ను రిపబ్లిక్ ప్రాంతంగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది. దీనిని బోస్నియా సెర్బ్స్ వ్యతిరేకించారు. అంతేకాదు బోస్నియా రాజధాని సరాజెవో నగరాన్ని ఆక్రమించారు. తమ నియంత్రణలోకి తీసుకున్నారు. మూడు సంవత్సరాలపాటు యుద్ధం జరిపారు. ఈ దారుణంలో నాడు 11,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ యుద్ధం జరుగుతుండగానే ఇటలీ (Italy) దేశానికి చెందినవారు ఘోరాలకు పాల్పడ్డారు. నాటి రోజుల్లోనే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ యుద్ధకాండపై పలు కథనాలను ప్రసారం చేశాయి. ఇటలీ శ్రీమంతులు డబ్బులు ఇచ్చి మరి సరా జెవో వీధులలో ఉన్న పౌరులను కాల్చి చంపారు. దీనికి స్నైపర్ టూరిజం (Sniper tourism)అని పేరు పెట్టారు. ఈ ఘోరాన్ని బోస్నియా సెర్బ్స్ దళాలు పర్యవేక్షించాయని నాడు మీడియా కథనాలను ప్రచురించింది. ఇటలీ దేశానికి చెందిన డబ్బున్న వారిని సరా జెవో చుట్టూ ఉన్న కొండలపైకి బోస్నియా సెర్బ్స్ దళాలు తీసుకెళ్లాయి. అక్కడ తుపాకులతో అమాయకులను కాల్చి శ్రీమతులు చంపారు. అమాయకులు చనిపోతుంటే రాక్షసానందం పొందారు. దీనికోసం నాటి సంపన్నులు దాదాపు కోటి వరకు చెల్లించారు. మనిషిని బట్టి రేటు చెల్లించి ఈ ఘోరానికి పాల్పడ్డారు. ముఖ్యంగా చిన్నారులను చంపి మరింత వికృతానందం పొందేవారు. వృద్ధులను సైతం వేటాడి వేటాడి చంపారు. నాడు ఇటలీ శ్రీమంతులు పాల్పడిన దారుణాలకు సంబంధించి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఏజియో గవాజని ఒక నివేదిక కూడా రూపొందించారు. దానికి తగ్గట్టుగా ఆయన ఆధారాలు సంపాదించలేకపోయారు.
2022లో స్లోవేనియా దర్శకుడు “సరా జెవో సఫారి” పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. దీనిని గవాజని చూశారు. ఆ తర్వాత తన పరిశోధనలను మళ్లీ మొదలుపెట్టారు. అనేకమంది వాంగ్మూలాలు సేకరించారు. నాడు చనిపోయిన వారి బంధువులను కలిసి.. అనేక వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఆ వివరాలను ఇటలీ దర్యాప్తు అధికారులకు అందించారు. అంతేకాదు ఈ ఘోరంపై దర్యాప్తు జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిలాన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇటలీ దేశంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.