Kim Jong Un insult interview: అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలని పేద, మధ్య తరగతి నిరుద్యోగుల కల. ఇందు కోసం చాలా మంది వివిధ మార్గాల్లో అమెరికాకు వెళ్తున్నారు. అక్కడకు చేరుకున్న తర్వాత స్థానికంగా ఉద్యోగాలు పొంది డాలర్లు సంపాదిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అక్రమ వలసలపై దృష్టిపెట్టారు. అమెరికా ఫస్ట్ నినాదంలో భాగందా అక్రమంగా దేశంలో ఉంటున్నవారిని గుర్తించి వారి దేశాలకు పంపించారు. ఇప్పటికీ ఉన్నవారిని జైలుకు పంపుతున్నాడు. ఇంకా అమెరికాకు బధ్ధ శత్రువు అయిన ఉత్తర కొరియా నుంచి అక్రమంగా అమెరికాకు వచ్చినవాళ్లు ఇప్పటికీ ఉన్నట్లు ట్రంప్ భావిస్తున్నారు. దీంతో వారిని గుర్తించేందుకు అమెరికా ఐటీ కంపెనీలు ఇంటర్వ్యూ కు వచ్చిన వారికి ఒక విచిత్రమైన ‘లిట్మస్ టెస్ట్‘ను ప్రవేశపెట్టాయి.
కిమ్‌ను తిడితే ఓకే..
ఈ కొత్త ఇంటర్వ్యూ టెస్ట్‌లో భాగంగా, అభ్యర్థులను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను ‘లావు, అగ్లీ పిగ్‘ అని తిట్టమని అడుగుతున్నారు. ఇది కేవలం మాటల పరీక్ష కాదు. అభ్యర్థి నిజంగా నార్త్ కొరియాకు చెందినవాడా కాదా అని నిర్ధారించుకునే కీలక పరీక్ష. నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్‌ను దేవుడిగా భావిస్తారు. ఆయనను అవమానించడం అక్కడ శిక్షార్హమైన నేరం, మరణశిక్ష కూడా విధించవచ్చు. నిజమైన నార్త్ కొరియన్లు కిమ్‌ను తిట్టడానికి మానసికంగా సిద్ధపడలేరు. భయం, భక్తి వల్ల అలా మాట్లాడలేరు. ఈ టెస్ట్‌లో విఫలమైనవారు వెంటనే బయటపడతారు.
ఫలిస్తున్న వింత టెస్ట్..
ఈ వింత టెస్ట్‌లోనే ’టారో ఐకూచి’ అనే నార్త్ కొరియన్ ఏజెంట్ దొరికిపోయాడు. జపానీ పేరుతో, నకిలీ ఐడెంటిటీతో ఇంటర్వ్యూకు హాజరైన అతడిని కిమ్‌ను తిట్టమని అడిగారు. మొదటి రౌండ్‌లో ఉత్తర కొరియా భద్రత గురించి చర్చ వచ్చినప్పుడు, ఐకూచి ‘నాకు నార్త్ కొరియా బాగా తెలుసు‘ అని అన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఇంటర్వ్యూయర్, ‘కిమ్ జాంగ్ ఉన్‌ను ’బాస్టర్డ్’ అని పిలవగలరా?‘ అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఐకూచి ముఖం నుంచి చిరునవ్వు మాయమైంది. మాటలు రాలేదు. అకస్మాత్తుగా కనెక్షన్ డిస్‌కనెక్ట్ అయిపోయింది. మళ్లీ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఈసారి ‘కిమ్ జాంగ్ ఉన్ ఒక లావు, అగ్లీ పిగ్‘ అని పూర్తి వాక్యం చెప్పమన్నారు. ఐకూచి ఏమీ మాట్లాడలేక, ఇంటర్వ్యూ మధ్యలోనే కనెక్షన్ కట్ చేసి పరారయ్యాడు. ఈ ప్రవర్తనతో అతడు నార్త్ కొరియా ఏజెంట్ అని నిర్ధారణ అయింది. అతడి గీ, లింక్డ్‌ఇన్, గిట్‌హబ్ ఖాతాలు తర్వాత తొలగించబడ్డాయి.
నార్త్ కొరియా ఐటీ మోసం..
ఈ మోసపూరిత పథకం అత్యంత వ్యూహాత్మకంగా సాగుతోంది. అమెరికన్లు, జపనీస్, కెనడియన్లుగా నటిస్తూ దొంగిలించిన ఐడీలు వాడతారు. గిట్‌హబ్, లింక్డ్‌ఇన్, వ్యక్తిగత వెబ్‌సైట్లు సృష్టించి నమ్మకం కలిగిస్తారు. వర్క్–ఫ్రం–హోమ్ ఐటీ పోజిషన్లను టార్గెట్ చేస్తారు. అమెరికాలోని మధ్యవర్తుల దగ్గర కంపెనీ ల్యాప్‌టాప్‌లు ఉంచి, వాటిని నార్త్ కొరియా నుంచే ఆపరేట్ చేస్తారు. క్లౌడ్ పాస్‌వర్డులు, గిట్‌హబ్ కోడ్ కీలు, సెన్సిటివ్ డేటా దొంగిలిస్తారు. మాల్‌వేర్ ద్వారా క్రిప్టోకరెన్సీని దొంగిలిస్తారు. సంపాదించిన లక్షల డాలర్లను నార్త్ కొరియా ప్రభుత్వానికి పంపిస్తారు.
‘కిమ్‌ను తిట్టగలరా?‘ అనే ఈ వింత టెస్ట్, నార్త్ కొరియా ఐటీ మోసాలను అడ్డుకోవడానికి అమెరికా కంపెనీలు తీసుకున్న సృజనాత్మక చర్య. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం, మరో వైపు రాజకీయ భక్తి. ఈ రెండింటి మధ్య సాగుతున్న ఈ యుద్ధంలో, చిన్నపాటి మాటే పెద్ద నిజాన్ని బయటపెడుతోంది.