KA Paul Powerful Speech: ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటుంది. తెలుగులోకి అనువదిస్తుంటే వినాలి అనిపిస్తుంది. నిమిషాలు సెకండ్లు అవుతుంటాయి. గంటలు నిమిషాలవుతుంటాయి. రోజులు గంటలుగా మారిపోతుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు సంబంధించిన ఉపోద్ఘాతం ఒక పట్టాన ముగిసిపోదు. అంతటి విద్యుత్తు, అంతటి విద్వత్ ఉన్న అతడు ఒక ప్రభలాగా వెలిగిపోయాడు. కానీ ఏం జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా జోకర్ గా మారిపోయాడు. ప్రపంచ దేశాల అధినేతలను కలిసిన అతడి స్థాయిని తగ్గించుకున్నాడు. వాస్తవానికి అతడి పతనాన్ని చూస్తుంటే చాలామందికి బాధ కలుగుతుంది. అటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు అమెరికాలో అత్యంత శక్తివంతంగా మాట్లాడాడు. దానికి సంబంధించిన వార్తను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయలేదు కానీ.. సోషల్ మీడియా ద్వారా అతని ప్రసంగం బయటికి వచ్చింది. అది విన తర్వాత చాలామందిలో ఒక అనుమానం వచ్చింది.. నిజంగా కేఏ పాల్ స్థాయికి మనం ఎదగలేదా? అతడిని ఇంకా మనం జోకర్ గానే చూస్తున్నామా? అనే ప్రశ్న మరింత బలపడిపోయింది.
అంతర్జాతీయ వేదికల మీద కేఏ పాల్ అత్యంత శక్తివంతంగా మాట్లాడుతారు. గంభీరమైన వచనాలు ప్రవచిస్తారు. ఇదేం కొత్త కాకపోయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన మాట్లాడితే చాలా మంది జోకర్ అని భావిస్తున్నారు. అందువల్లే ఆయన స్థాయి చాలామందికి అర్థం కావడం లేదు.
కేఏ పాల్ ఇటీవల అమెరికా వెళ్లారు. అమెరికాలో ఆయనకు అత్యంత అర్ధమైన గౌరవం లభించింది. గ్లోబల్ పీస్ అంబాసిడర్ హోదాలో ఆయనకు ఆహ్వానం లభించింది. అమెరికా వెళ్ళిన ఆయన కాన్సాస్ స్టేట్ సెనెట్ సభను ఉద్దేశించి శక్తివంతంగా ప్రసంగించారు. భారత్, అమెరికాకు సంబంధించిన దౌత్య సంబంధాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పట్టింపులకు పోవద్దని.. పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే శాంతిస్థాపన సాధ్యమవుతుందని ప్రకటించారు. ప్రపంచ రాజకీయాలను శాసించే సత్తా ఈ రెండు దేశాలకు ఉందని.. శాంతి స్థాపనకు ఈ రెండు దేశాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
58 దేశాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు చేస్తున్నాయని.. ఇది మంచి పరిణామం కాదని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో పాటు సంపద కూడా ఈ యుద్ధం వల్ల నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంసం పూర్తి ఆగిపోవాలని.. అప్పుడే ప్రపంచ సౌఖ్యం సాధ్యమవుతుందని కేఏ పాల్ పేర్కొన్నారు.
వాస్తవానికి పాల్ ఇలా మాట్లాడడం సెనెట్ సభ్యులకు ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ.. మిగతా వారికి మాత్రం ముఖ్యంగా తెలుగు వారికి మాత్రం ఒకరకంగా గూస్ బంప్స్ తెప్పించింది. కేఏ పాల్ ను చాలామంది ఒక జోకర్ గానే చూస్తారు. మీడియా సంస్థలు అయితే ఆయనను ఒక ఐటమ్ రాజా గానే ప్రొజెక్ట్ చేస్తుంటాయి. ఇది ఎంతవరకు కరెక్టో మీడియా సంస్థల అధిపతులు తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీడియా అధినేతలు కేఏ పాల్ ను తొక్కి పెట్టినంతమాత్రాన ఆయన ప్రసంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియకుండా అడ్డుకోలేదు. నేటి కాలంలో సోషల్ మీడియా బలంగా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఇంటర్నెట్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. కేఏ పాల్ ఈ రోజున ఒక జోకర్ కావచ్చు. అమెరికా వంటి దేశంలో మాత్రం ఒక అద్భుతమైన వక్త. ఆ విషయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోవద్దు. ముఖ్యంగా తెలుగు మీడియా అది నేతలు అస్సలు విస్మరించవద్దు.