Jorge Perez : ఒక తరం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తే, తర్వాతి తరం దాని పగ్గాలను అందుకోవడం సాధారణ ధోరణి. అనేక సంస్థల్లో వారసత్వం ద్వారా ఉన్నత స్థానాలు సునాయాసంగా దక్కుతాయి. కానీ అమెరికా(America)లోని ఫ్లోరిడా(Florida)కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ రిలేటెడ్ గ్రూప్ అధినేత జోర్గ్ పెరెజ్(Gorg Perej) ఈ సంప్రదాయాన్ని భిన్నంగా నడిపారు. 60 బిలియన్ డాలర్ల విలువైన తన సంస్థ భవిష్యత్తును కాపాడేందుకు, కుమారుడు జాన్ పాల్‌కు సంస్థలో సులభంగా ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు.
కళాశాల చదువు పూర్తి చేసి సంస్థలో చేరాలనుకున్న జాన్(Jhon)కు పెరెజ్ స్పష్టమైన షరతులు విధించారు. ‘నీవు నా దగ్గర పని చేయలేవు. వారసుడిగా సంస్థ ప్రతిష్ఠను పణంగా పెట్టను. ముందు నా స్నేహితుడి సంస్థలో నీ సామర్థ్యం నిరూపించుకో. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మార్కెట్(New yark Real estate Market)లో ఐదేళ్లు పని చేసి, టాప్ బిజినెస్ స్కూల్ నుండి పట్టా తీసుకో‘ అని ఆదేశించారు. జాన్ మొదట ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు, కానీ తండ్రి సలహా మేరకు బిలియనీర్ స్టీఫెన్ రాస్ సంస్థలో అనలిస్ట్‌గా చేరి, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు.
Also Read : అమెరికా హోటల్ పరిశ్రమపై భారతీయుల ప్రభావం: విజయం లేదా వివాదం?‘
అనుభవం సంపాదించినా..
2012 నాటికి జాన్ తగిన అనుభవం సంపాదించినప్పటికీ, రిలేటెడ్ గ్రూప్‌లో ఉన్నత పదవి ఇవ్వలేదు. మొదట రెంటల్ బిజినెస్ బాధ్యతలు చేపట్టి, క్రమంగా తన పనితీరుతో సీఈఓ స్థానాన్ని సాధించారు. అదే విధంగా, జాన్ సోదరుడు కూడా సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరారు. ప్రస్తుతం జోర్గ్ పెరెజ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. దశాబ్ద కాలం తన కుమారుల సామర్థ్యాలను పరీక్షించిన తర్వాతే వారికి బాధ్యతలు అప్పగించారని పెరెజ్ తెలిపారు.
డబ్బు కోసం నచ్చని పని చేయొద్దని..
‘నేను రియల్ ఎస్టేట్‌లో విజయం సాధించానని వారు ఆసక్తి లేకపోయినా ఈ రంగంలోకి రాకూడదు. జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. నచ్చని పనిని డబ్బు కోసం చేయడం వృథా. ఇంటిపేరు కారణంగా పదవులు దక్కాయని సిబ్బంది భావించకూడదు‘ అని పెరెజ్ తన సిద్ధాంతాన్ని వివరించారు.