Bannu police station terrorist attack: పాముకు పాలు పోసి పెంచితే.. అదేమీ అమృతాన్ని ఇవ్వదు. విషాన్ని ఇస్తుంది. పైగా కాటు వేసి చంపేస్తుంది. ఈ అనుభవం ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ దేశానికి అనేక సందర్భాల్లో అనుభవంలోకి వచ్చినప్పటికీ మారదు. మారే ప్రయత్నాన్ని కూడా పాకిస్తాన్ చేయదు. ఎందుకంటే అది పాకిస్తాన్ దేశం కాబట్టి.
పాకిస్తాన్ దేశంలో లష్కరే ఏ తోయిబా, జేషే మహమ్మద్.. వంటి ఉగ్ర వాద సంస్థలు చాలా ఉన్నాయి. ఈ సంస్థలు వాటిలో అవే పోటీపడి భారత్ మీద దాడులు చేస్తుంటాయి. తమలో తామే అప్పుడప్పుడు దాడులు చేసుకుంటాయి. ఈ ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఉంటుంది. ఆ మధ్య భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కేంద్ర కార్యాలయాల మీద భారత్ దాడులు చేసింది. ఆ సమయంలో ఈ సంస్థల కార్యాలయాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భారీగా నష్టం వాటిల్లింది. అయితే పాకిస్తాన్ ఆ ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు చెల్లించడం విశేషం.
ఇప్పటివరకు ఉగ్రవాద సంస్థలు చేసిన పనులతో లాభాలు పొందిన పాకిస్తాన్.. తొలిసారి నష్టాలను మూట కట్టుకుంది. ప్రజలను సక్రమంగా పాలించాల్సిన పరిపాలకులు ఉగ్రవాదులతో కలిసిపోతే ఎంతటి నష్టమో ఈ ఘటన నిరూపించింది. గత ఏడాది పాకిస్తాన్ దేశంలో ఇత్తేహదుల్ ముజాహిదిన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ ఏర్పాటయింది. ఇటీవల ఈ సంస్థ బన్ను అనే ప్రాంతంలో పతైకేల్ పోలీస్ స్టేషన్ పై మూడంచల విధానంలో దాడి చేసింది. 30 మంది పోలీసులను హత మార్చింది. ఆయుధాలు ఎత్తుకెళ్లింది.
ఈ ఘటనతో ఆ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ.. పాకిస్తాన్ ఆర్మీ.. ఇతర ఉగ్రవాద సంస్థలకు ప్రమాదకరమైన సంకేతాలను పంపించింది. తమ జోలికి వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు పాకిస్తాన్ లో అనేక ఉగ్రవాద సంస్థలు దేశంలో భయానక సంఘటనలు సృష్టించిన దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా ఐఎంపీ సంస్థ ఈ తరహా దాడులకు పాల్పడటం పాకిస్థాన్ పరిపాలకులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సంస్థకు వేరే ప్రాంతాల నుంచి నిధులు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఏదైనా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.