Sheikh Hasina: బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిరత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా దేశాలు పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఆ దేశానికి సరిహద్దులో మన దేశం కూడా అప్రమత్తమైంది. ఆదేశంతో పంచుకునే సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. చొరబాట్లను నిరోధించేందుకు భద్రతా దళాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. మరోవైపు అశాంతిని రగిలించే వీడియోలను, పోస్ట్ లను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానివల్ల బెంగాల్ రాష్ట్రంలో అశాంతి రగిలే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హసీనా ప్రభుత్వం కూల్చివేత వెనుక ఎవరు ఉన్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు గత మే నెలలో హసీనా చేసిన ఒక ప్రకటన సంచలన సమాధానంగా నిలుస్తోంది. ఇదే సమయంలో ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఏకంగా అగ్రరాజ్యమే రంగంలోకి దిగిందని వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అందువల్లే ఆమె కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే హసీనా పరోక్షంగా అటువంటి సంకేతాలు ఇచ్చారని ప్రస్తుతం జరుగుతోంది. అమెరికాతో షేక్ హసీనా ప్రభుత్వం సన్నిహిత సంబంధాలను కొనసాగించకపోవడం వల్లే ఇంతటి ఉత్పాతం జరిగిందనే వాదనలు లేకపోలేదు. అగ్రరాజ్యం ఆగ్రహానికి గురవడం వల్లే.. హసీనా తన పదవిని కోల్పోయారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బహిష్కరించింది. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని, ఇటువంటి ఎన్నికలను సిగ్గుమాలిన వ్యవహారంగా అభివర్ణించింది. అదే సమయంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న పోలింగ్, ఇతర అంశాలను పరిశీలించేందుకు అమెరికా, రష్యా, కెనడా, ఓఐసి, అరబ్ దేశాల నుంచి పార్లమెంట్ పర్యవేక్షకులు వచ్చారు. ఎన్నికలు జరిగిన విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సాఫీగా జరిగినట్టు వారు వివరించారు. అయితే ఇందులో అమెరికా మాత్రం భిన్నంగా స్పందించింది. ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని, పారదర్శకతకు పాతరవేశారని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇది సహజంగానే హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆమె ఆ ఎన్నికల్లో నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
అమెరికా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యల తర్వాత హసీనా కొన్ని రోజులపాటు మౌనాన్ని ఆశ్రయించారు. అయితే ఇటీవల మే నెలలో ఆమె ఒక సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తే.. నన్ను ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేందుకు చూస్తామని అమెరికా ఆఫర్ ఇచ్చిందని సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ సహజంగానే ప్రపంచం దృష్టిలో పడింది. అమెరికాను ద్వేషించే దేశాలకు ఆయుధంగా మారింది. హసీనా నేరుగా అమెరికా పేరు బయటకు చెప్పకపోయినప్పటికీ.. ఆ దేశం అమెరికా అయి ఉంటుందని ప్రపంచ దేశాలు అంచనా వేశాయి.” నేను పరిపాలిస్తున్న దేశంలో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకుంటామని ఒక దేశం నన్ను సంప్రదించింది. ఇందుకు ప్రతిఫలంగా నన్ను నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేందుకు సహకరిస్తామని ఆఫర్ ఇచ్చింది. నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. వాస్తవానికి వైమానిక స్థావరం వల్ల వారి లక్ష్యాలు వేరే ఉంటాయి. అది చాలా దూరం వెళుతుంది. ఎన్నో సమస్యలు ఎదురయ్యేందుకు అధికారణమవుతుంది. నేను భంగ బంధు రెహమాన్ కుమార్తెను. ఆ దేశాన్ని ఎవరికో అద్దెకు ఇవ్వలేను. అప్పగించలేనని” హసీనా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈస్ట్ తైమూర్ మాదిరి వాళ్లు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లోని చోటోగ్రామ్, మయన్మార్ ప్రాంతంలోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారని, బంగాళాఖాతంలో ఒక స్థావరం కూడా ఏర్పాటు చేసుకుంటారని హసీనా వ్యాఖ్యానించారు. దీంతో హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని ప్రచారం ప్రారంభమైంది. ఆమె కూడా రెహమాన్ వంటి దుస్థితిని ఎదుర్కొంటారనే వ్యాఖ్యలు వినిపించాయి.
బంగ్లాదేశ్ తయారు చేసే ఉత్పత్తులను అమెరికా ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. అయితే ఆ దేశం బంగ్లాదేశ్ లో ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ లోని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, అధికారుల వీసాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. “ఎన్నికల్లో పారదర్శకత కోసం మేము చాలా ఒత్తిడి చేశాం. చాలా విధాలుగా చెప్పి చూశాం. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వచ్చే పరిస్థితులు బంగ్లాదేశ్ ను తీవ్రంగా ఇబ్బంది పెడతాయని” ఈ ఏడాది జనవరిలో బ్లూమ్ బెర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్ విల్సన్ సెంటర్ సౌత్ ఏషియా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మిషెల్ కుగ్ ల్మెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రెండు నెలలకు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అజీజ్ అహ్మద్ పై అమెరికా ఆంక్షలు విధించింది. మరోవైపు గత ఏడాది తమ దేశంలో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ అమెరికా దౌత్య వేత్త పీటర్హాస్ పై బంగ్లాదేశ్ అధికార పక్షం నేతలు ఆరోపణలు చేశారు. అయితే వీటిని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అమెరికా ఆరోపించింది. ఇవి జరిగిన కొద్ది రోజులకు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత అది పెద్ద సంక్షోభానికి కారణమైంది. ఫలితంగా షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొదట్లో ఈ వ్యవహారం వెనుక చైనా ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత అమెరికా హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: It is suspected that the hand of america is behind the collapse of hasinas government