AP Politics : ఏపీ రాజకీయాల్లో చాలామంది నేతలు నిష్క్రమణకు సిద్ధమవుతున్నారు.దశాబ్దాలుగా రాజకీయాలు చేసి… ఎన్నో కీలక పదవులు అలంకరించిన వారు సైతం గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. అన్ని పార్టీల నేతల్లో ఏడుపదులు దాటిన వారు గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న చాలామంది నేతలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. తమ వారసులను బయటకు తెచ్చారు.టిక్కెట్లు ఇప్పించుకొని గెలిపించుకున్నారు. దీంతో గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీలో భిన్న వాతావరణం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ వారసులను బరిలో దింపేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ జగన్ అంగీకరించలేదు.తప్పనిసరి పరిస్థితుల్లో వారే పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పలేదు.దీంతో సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు. ఓటమి తర్వాత ఆ బాధ్యతలను వారసులకు అప్పగిస్తే వారి రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. అందుకే కొందరు బయటపడటం లేదు. అయితే మరి కొందరు మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు తెలుసుకుంటారని.. అందుకే వారికి లైన్ క్లియర్ చేయాలని చూస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలే అవుతుండడంతో.. కొద్ది రోజులు వెయిట్ చేసి తమ నిర్ణయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. రాజకీయ వారసుడ్ని అధికారికంగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై
ఇటీవల సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన సోదరుడు కృష్ణ దాస్ సైతం ప్రజా జీవితం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది. వారి వారసులను తెరపైకి తెచ్చి వారు పక్కకు తప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు అధినేత జగన్ కు చెప్పినా ఆయన వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు జగన్ కు ఒక మాట చెప్పి ప్రకటన చేసేందుకు ఇద్దరు సోదరులు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క ధర్మాన సోదరులే కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సీనియర్లు ఇదే బాట పడుతున్నట్లు సమాచారం.
* వారసులకు ఛాన్స్
మొన్నటి ఎన్నికల్లో చాలామంది సీనియర్లు తప్పుకున్నారు. తమ వారసులకు ఛాన్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన స్థానంలో కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ టికెట్ తెప్పించుకున్నారు. యనమల రామకృష్ణుడిది అదే పరిస్థితి. ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. కుమార్తెకు అసెంబ్లీ టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. టీజీ వెంకటేష్, కొనకళ్ళ నారాయణ వంటి వారు సైతం రాజకీయాలకు దూరమయ్యారు. పల్లె రఘునాథ్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి సైతం ఈసారి పోటీ చేయలేదు. వారంతా వారసులనే బరిలో దించారు.
* దాదాపు యువకులే
2029 ఎన్నికల నాటికి 7 పదుల వయసున్న ఎమ్మెల్యేలు కనిపించరు. కచ్చితంగా వారసులు ఎక్కువమంది పోటీ చేస్తారు. ఇప్పటికే యువ ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నారు. మంత్రుల్లో పదిమంది కొత్త వారే. అందరూ దాదాపు యువకులే. ఇప్పుడు సభలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వచ్చే ఎన్నికల నాటికి తప్పుకోవడం ఖాయం. వారి స్థానంలో వారసులు పోటీ చేస్తారు. మరికొన్ని స్థానాల్లో యువతకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి. మొత్తానికైతే ఏపీ శాసనసభలో, రాజకీయాలలో సీనియర్లు కనుమరుగు కావడం ఖాయం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More