Iran Israel War 2024: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఊహించిందే నిజమైంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ యుద్ధం ప్రారంభించింది. డ్రోన్లతో శనివారం సాయంత్రం అటాక్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ కూడా తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు ఇరాన్, ఇజ్రాయెల్‌లోని తమ రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేవాయి. యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా శాత్రిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని భారత్ తెలిపింది. తక్షణమే ఇరు పక్షాలు వెనక్కు తగ్గాలని, సంయమనం పాటించాలని సూచించింది. హింసను వీడి దౌత్య మార్గంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఇండియా వెల్లడించింది. భారతీయులతో తమ రాయబార కార్యాలయాలు టచ్‌లో ఉన్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయుల రక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
అప్రమత్తమైన యూకే..
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో యూకే కూడా అప్రమత్తమైంది. దాడులను నిరోధించడానికి ఎయిర్‌ఫోర్స్ జెట్లు, ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను సిద్ధం చేశామని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపు ఇజ్రాయెల్ రక్షణ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కోద్దీ రాకెట్లను ప్రయోగించింది.
స్పందించిన ఐక్యరాజ్యసమితి..
మరోవైపు ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. యూఎన్‌వో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ యుద్ధాన్ని ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని స్పష్టం చేశారు. ఇరు దేశాలు తక్షణమే యుద్ధం ఆలోచన విరమించాలని సూచించారు. మరోవైపు యూఎన్‌వో భద్రతా మండలి అత్యవసర సమావేశం కావాలని తెలిపారు.
అమెరికాను ఇరాన్ వార్నింగ్..
ఇదిలా ఉండగా యుద్ధం మొదలు పెట్టిన ఇరాన్.. అగ్రరాజ్యం అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. యూఎన్‌వో చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి మొదలు పెట్టినల్లు ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఇరాన్ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇజ్రాయెల్‌వైపు దూసుకొస్తున్న డ్రోన్లు, మిసైల్స్..
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌వైపు ఇరాన్ వదిలిన డ్రోన్లు, మిసైల్స్ దూసుకొస్తున్నాయి. సుమారు 200లకుపైగా డ్రోన్లు, మిసైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది. మరోవైపు వాటిని తిప్పకొట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో ఇజ్రాయెల్‌వైపుగా రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను దూసుకొస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ డ్రోన్లు, మిసైల్స్ తమ గగనతలంలోకి రాగానే సైరన్ మొగించి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చివేసింది. డ్రోన్ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు సమాచారం.