Israel: ఇజ్రాయిల్.. ఈ పేరు చెప్తే ఐరన్ డోమ్ గుర్తుకొస్తుంది.. శత్రు దేశాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఇజ్రాయిల్ దేశం ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇటీవల శత్రు దేశాలు దాడి చేయడంతో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వ్యవస్థ వార్తల్లోకి ఎక్కింది. ఇందులో ఉన్న లోపాలు ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.
ఐరన్ డోమ్ రక్షణ చట్టం ఇప్పటికే ఇజ్రాయిల్ దేశానికి ఉంది. అయితే దీనిని మించే విధంగా అతి తక్కువ ఖర్చుతో లేజర్ వ్యవస్థను ఇజ్రాయిల్ దేశం అందుబాటులోకి తెచ్చుకుంది. దీనికి ఐరన్ బీమ్ అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ రక్షణ శాఖలోని పరిశోధన అభివృద్ధి విభాగం చీఫ్ బ్రిగేడియర్ డేనియల్ గోల్డ్ వెల్లడించారు.. “ఐరన్ బీమ్ వ్యవస్థను పూర్తి చేసాం. దీని అభివృద్ధి కూడా పూర్తయింది. దీని సామర్థ్యాన్ని పరీక్షించే పరిశీలన కూడా పూర్తయిందని” ఆయన పేర్కొన్నారు. అంతేకాదు డిసెంబర్ 30న దీనిని ఇజ్రాయిల్ మిలిటరీ విభాగానికి అందిస్తామని గోల్డ్ వెల్లడించారు.
అతి తక్కువ ఖర్చుతో లేజర్ వ్యవస్థను డెవలప్ చేయడం ద్వారా శత్రుదేశాల కుయుక్తులను ముందే పసిగట్టడానికి అవకాశం ఉంటుందని ఇజ్రాయిల్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. దాడుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఇజ్రాయిల్ రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. రాకెట్లు, డ్రోన్లు, ఇతర వంటి వాటితో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటామని ఇజ్రాయిల్ వర్గాలు అంటున్నాయి. భూ ఆధారిత హై పవర్ లేజర్ వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా దేశాన్ని అన్ని విధాలుగా కాపాడుకునే అవకాశం ఉంటుందని ఇజ్రాయిల్ రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వ్యవస్థ యుద్ధరంగంలో చేసే పోరాటాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఇజ్రాయిల్ రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇజ్రాయిల్ దేశానికి దశాబ్ద కాలం పట్టింది. భవిష్యత్ కాలంలో జరిగే యుద్ధాలు.. ఇతర వ్యవహారాల వల్ల దేశం నష్టపోకూడదని ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశానికి ముప్పు ఏర్పడినప్పుడు సరైన సమయంలో వీటిని కార్యాచరణలోకి తీసుకొస్తారు. ఇటీవల కాలంలో స్వల్ప శ్రేణి వ్యూహాత్మక లేజర్ వ్యవస్థలను ఇజ్రాయిల్ ఉపయోగించింది. అవి పదులకొద్దీ లక్ష్యాలను సులభంగా అడ్డగించాయి. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థకు ఐరన్ డోమ్ బలమైన వ్యవస్థగా ఉండగా.. దానికి ఇప్పుడు ఐరన్ బీమ్ జత చేరింది. అయితే దీని నిర్వహణ వ్యయం చాలా తక్కువని తెలుస్తోంది.