China : వ్యాధి వస్తే చాలా మంది హాస్పిటల్స్ కు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం చైనాలో చాలా మంది జూకు వెళ్తున్నారు. అవును మనసు ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే అదే బెటర్ అనుకుంటున్నారా? మీరు అనుకున్నది నిజమే కానీ వారు వెళ్లేది జూలో ఎంజాయ్ చేయడానికి కాదు. పులి మూత్రం కొనుగోలు చేయడానికి. చాలా ప్రాంతాల్లో వింత వింత పోకడలు ఉంటాయి. కొందరు సొంత చికిత్స కూడా చేసుకుంటారు. ఇక అచ్చం అదే విధంగా చైనాలోని ఓ జూలో అదే జరుగుతుంది. కీళ్ల నొప్పులకు జనాలు ఏం చేస్తారో మీకు తెలుసా? ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ను తెలుసుకోవడానికి పూర్తిగా ఈ ఆర్టికల్ ను చదివేసేయండి.
ప్రజలు వ్యాధుల చికిత్స కోసం, ప్రజలు డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. కానీ చైనాలో మాత్రం కీళ్లనొప్పులకు చికిత్స పొందేందుకు వింత పనులు చేస్తున్నారు. ఇక్కడ రుమాటిక్ ఆర్థరైటిస్‌ను నయం చేయడానికి పులి మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. చైనా మార్కెట్‌లో పులి మూత్రాన్ని బాటిళ్లలో పెట్టి మంచి ధరకు విక్రయిస్తున్నారట.
జూలో పులి మూత్రం
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఒక జూ ఆర్థరైటిస్‌కు చికిత్సగా పులి మూత్రాన్ని విక్రయిస్తోంది. ఈ జూ పేరు-యాన్ బిఫెంగ్జియా వైల్డ్‌లైఫ్ జూ. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈ జూ సైబీరియన్ పులుల మూత్రాన్ని విక్రయిస్తోంది. ఇది ఆర్థరైటిస్, బెణుకు, కండరాల నొప్పి నుంచి అద్భుతమైన ఉపశమనాన్ని అందిస్తుందని కూడా పేర్కొంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ జూలో పులి మూత్రం బాటిళ్లను ఒక్కో బాటిల్‌కు 50 యువాన్లకు (దాదాపు రూ. 600) విక్రయిస్తోంది. ఒక్కో సీసాలో 250 గ్రాముల పులి మూత్రం ఉంటుంది. నొప్పి, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందడానికి పులి మూత్రాన్ని ఎలా ఉపయోగించాలో కూడా జూ సూచనలు ఇస్తుంటుంది. ఇందుకోసం పులి మూత్రాన్ని వైట్ వైన్, అల్లం ముక్కలతో కలిపి నొప్పి ఉన్న చోట రాయాలి అని చెబుతుంటారట. అయితే కొన్ని సార్లు ఈ పులి మూత్రం తాగవచ్చని కూడా జూ అధికారులు చెబుతుంటారట. కానీ ఎవరికైనా ఎలర్జీ ఉంటే మాత్రం అసలు తాగవద్దని హెచ్చరిస్తారు.
చైనాలో గందరగోళం
మరి ఈ పులి మూత్రం ఎలా తీస్తారు అనే ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. పులి మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ మూత్రాన్ని బేసిన్ నుంచి సేకరిస్తారని ఈ జూ సిబ్బంది ఒకరు తెలిపారు. అయితే క్రిమిసంహారకమా లేదా అనేది మాత్రం చెప్పలేదు. అనారోగ్యంతో పులి మూత్రం సేవిస్తారనే ఈ వార్త చైనాలో కలకలం సృష్టించింది. దీన్ని పలువురు వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా నిరూపించని చికిత్సలను ప్రోత్సహించడం వల్ల అనేక ప్రమాదాలు ఏర్పడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.