Iran: మూడు దేశాలపై ఇరాన్ బాంబులు.. పశ్చిమాసియాలో భారీ యుద్ధం తప్పదా?

పశ్చిమ ఆసియా దేశాల్లో హమాస్_ ఇజ్రాయిల్ యుద్ధంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్ కు మద్దతుగా ఎర్ర సముద్రంలో నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులకు పాల్పడ్డారు. ఫలితంగా హౌతి స్థావరాలపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 18, 2024 8:52 pm

Iran

Follow us on

Iran: నిత్యం బాంబుల మోత.. జనావాసాలపై పడుతున్న క్షిపణులు.. ఫలితంగా పశ్చిమాసియా దేశాలు వణికి పోతున్నాయి. హమాస్_ ఇజ్రాయిల్ యుద్ధంతో మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తుండడం కలవరపరుస్తోంది. తాజాగా ఇరాన్ అటు అమెరికా, ఇటు ఇజ్రాయిల్, రేపు పాకిస్తాన్ దేశాలను కవ్వించింది. సిరియాలో కొన్ని ప్రాంతాలు లక్ష్యంగా చేసుకొని 1200 నుంచి 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేదించగలిగే క్షిపణులను ప్రయోగించింది. ఇక పాకిస్తాన్లోని బాలుచిస్తాన్ ప్రాంతంలోనూ దాడులు చేసింది. ఏకకాలంలో అటు అమెరికాకు, ఇటు ఇజ్రాయిల్ కు, మధ్యలో పాకిస్తాన్ దేశాన్ని కవ్వించింది. అయితే ఈ చర్యతో ఏం జరుగుతుందనేది అంతుపట్టకుండా ఉంది.

పశ్చిమ ఆసియా దేశాల్లో హమాస్_ ఇజ్రాయిల్ యుద్ధంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్ కు మద్దతుగా ఎర్ర సముద్రంలో నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులకు పాల్పడ్డారు. ఫలితంగా హౌతి స్థావరాలపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడింది. తాజాగా ఇరాక్, సిరియా, పాకిస్తాన్ దేశాలపై ఇరాన్ వరుసగా దాడులకు దిగింది. గత రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్_ రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా నెలకొన్న పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. సున్ని మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్ కు చెందిన రెండు ప్రధాన స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. దీనిపై పాకిస్తాన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ తమ గగనతల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశం నుంచి ఇరాన్ రాయబారిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఇరాన్ దేశంలో ఉన్న తమ రాయబారిని కూడా వెనక్కి పంపిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఇరాన్ చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది.

ఇరాన్ చేసిన దాడుల తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దులు పంచుకునే సిస్తాన్ ప్రావిన్స్ లో ఇరాన్ రెవల్యూషనరీ గాడ్స్ కు చెందిన సభ్యుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపడం పెను సంచలనానికి దారి తీసింది. మరోవైపు శత్రువులను ఎదుర్కొనేందుకు తమ క్షిపణి శక్తిని మరింత సమర్థవంతంగా వాడుకునేందుకు ఏమాత్రం వెనకడుగు వేయబోమని ఇరాన్ ప్రకటిస్తుండడం విశేషం.. ఇక ఈ దాడులు జరుగుతుండగానే హమాస్_ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రత మరింత పెరిగింది. దాడులు ప్రతిదాడు లతో ఆ ప్రాంతం మొత్తం భీకరంగా మారింది. హమాస్ కు ఇరాన్, యేమెన్ హౌతీలు మద్దతుగా ఉన్నాయి. ఇక ఎర్ర సముద్రంలో అమెరికా, దాని మిత్రదేశాల వాణిజ్య నౌకలపై హౌతీలు వరుస దాడులు చేస్తున్నారు.. అయితే అమెరికా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు పెడచెవిన పెట్టారు.. దీంతో అమెరికా, బ్రిటన్ క్షిపణులతో యేమన్ లోని హౌతి స్థానిక స్థావరాలపై దాడులు చేశాయి. ఇక దీనికి ప్రతిదాడి అన్నట్టుగా హౌతీలు సోమవారం యేమన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో అమెరికా నౌకపై యాంటి షిప్ క్షిపణితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో హౌతీలను మళ్లీ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేరుస్తూ అమెరికా బుధవారం నిర్ణయం తీసుకుంది.