Iran America peace agreement: ఇరాన్-అమెరికా మధ్య సంఘర్షణలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో లెబనాన్‌లోని హిజ్బుల్లా సంఘర్షణలు, హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు, అమెరికా నౌకాదళ దిగ్బంధనం వంటి అంశాలు ప్రాంతీయ స్థిరత్వాన్ని బాగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎం ఓ యూ) డ్రాఫ్ట్ ను మెహర్ న్యూస్ ఏజెన్సీ బయట పెట్టింది. ఇది ఒక కొత్త అధ్యాయానికి సంకేతంగా కనిపిస్తోంది.
ఒప్పందం ముఖ్య నిబంధనలు.
మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ డ్రాఫ్ట్‌లో అనేక కీలక అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి..
– లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో వెంటనే శత్రుత్వాలు పూర్తిగా నిలిపివేయడం.
అమెరికా ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మరియు సార్వభౌమత్వాన్ని గౌరవించడం.
– అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని 30 రోజుల్లోగా ఎత్తివేయడం.
– హార్ముజ్ జలసంధిని 30 రోజుల్లోగా ఇరాన్ అరేంజ్మెంట్లతో తిరిగి తెరవడం.
– ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రులు కనీసం 300 బిలియన్ డాలర్ల ప్రణాళికలు సమర్పించడం.
– ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఎన్ పీ టీ(న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ) నిబంధనలను పాటించడం.
– ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల ఫ్రోజెన్ ఫండ్స్‌ను విడుదల చేయడం.
– ఇవి కాకుండా, చమురు మరియు పెట్రోకెమికల్ ఎగుమతులపై సాంక్షన్లు తాత్కాలికంగా నిలిపివేయడం, 60 రోజుల చర్చల కాలం, మానిటరింగ్ మెకానిజం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ వంటి అంశాలు కూడా డ్రాఫ్ట్‌లో ఉన్నట్లు సమాచారం.
ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు..
ఈ ఒప్పందం అమలైతే ఇరాన్‌కు ఆర్థికంగా పెద్ద ఊపిరి లభిస్తుంది. ఆంక్షల ఎత్తివేత, ఫండ్స్ విడుదల, పునర్నిర్మాణ సహాయం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతం లభించవచ్చు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం వల్ల ప్రపంచ చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చి, ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిది. ప్రాంతీయంగా లెబనాన్‌లో యుద్ధం ముగింపు ఒక పెద్ద ఉపశమనం. ఇది హిజ్బుల్లా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలను తగ్గించి, సిరియా, యెమెన్ వంటి ఇతర సంఘర్షణలపైనా పరోక్ష ప్రభావం చూపవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగడం అనేది రెండు దేశాల మధ్య నమ్మకం నిర్మాణానికి మొదటి అడుగు కావచ్చు.
ఒప్పందం అమలైతే చైనా, రష్యా వంటి దేశాల ప్రభావం మధ్యప్రాచ్యంలో తగ్గవచ్చు లేదా మారవచ్చు. అమెరికా తన దృష్టిని ఇతర ప్రాంతాలకు మరల్చవచ్చు. అయితే, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి మిత్రుల అభిప్రాయాలు కూడా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్లు, షిప్పింగ్, ఇన్వెస్ట్మెంట్లు ఈ పరిణామాలను బట్టి మారవచ్చు. ఇప్పటికే కొన్ని నివేదికల ప్రకారం ఆయిల్ ధరలు తగ్గడం ప్రారంభమైంది. కానీ దీని విజయం పూర్తిగా అమలు, నమ్మకం నిర్మాణం, అన్ని పక్షాల సహకారంపై ఆధారపడి ఉంది. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకం కార్యక్రమం జరగవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
