Pakistan : ప్రధాని మోదీకి పాకిస్తాన్‌ నుంచి ఆహ్వానం.. సీహెచ్‌జీ సమావేశానికి రావాలని వినతి!

పాకిస్తాన్‌.. మనతోకలిసి స్వాతంత్రోద్యమం చేసింది. మనతో కలిసే స్వాతంత్య్రం పొందింది. కానీ, స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ప్రత్యేక ముస్లిం దేశంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో పరస్పర అంగీకారంతో భారత్‌ రెండుగా విడిపోయింది. పాకిస్తాన్‌ ఆవిర్భవించింది. అయితే విడిపోయిన పాకిస్తాన్‌ నాటి నుంచి నేటి వరకు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.

Written By: Raj Shekar, Updated On : August 25, 2024 4:00 pm

Pakistan invites PM Modi

Follow us on

Pakistan : పాకిస్తాన్‌.. మన దాయాది దేశం. మనమంటే గిట్టని దేశం.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని దేశం.. మన దేశం ప్రశాంతంగా ఉండడం నచ్చని ఏకైక దేశం. ప్రతీదానికి గిచ్చి కయ్యం పెట్టుకునే పాకిస్తాన్‌కు కార్గిల్‌ యుద్ధం తర్వాత భారత నేతలుగానీ, భారత ఆటగాళ్లుగానీ వెళ్లడం లేదు. క్రీడలను కూడా తటస్త వేదికలపై ఆడేందుకే భారత్‌ ఇష్టపడుతుంది. అయితే 2014లో ప్రధాని పదవి చేపట్టాక మోదీ ఒకరోజు సడెన్‌గా పాకిస్తాన్‌లో ప్రత్యక్షమయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడ గడిపి తిరిగి వచ్చారు. ఆ తర్వాత పుల్వామా, ఘటనతో భారత్‌ రెండుసార్లు పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్రైట్‌ చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను కూల్చివేసింది. వందల మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో భారత్, పాక్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మన ఎయిర్‌ చీఫ్‌ మాస్టర్‌ పాకిస్తాన్‌లో పడిపోవడంతో దౌత్యపరంగా మాట్లాడి తీసుకువచ్చింది. అప్పగించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది. వరుస పరిణామాలతో పాకిస్తాన్‌ నేతలను కూడా భారత్‌ ఎలాంటి కార్యక్రమాలకు పిలవం లేదు. కానీ, చాలా కాలం తర్వాత పాకిస్తాన్‌ నుంచి భారత ప్రధానికి ఆహ్వానం అందింది.

సీహెచ్‌జీ సమావేశానికి రావాలని..
పాకిస్తాన్‌లో ఈ ఏడాది అక్టోబర్‌లో కౌన్సిల్‌ ఆఫ్‌ హెడ్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ (సీహెచ్‌జీ) సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి రావాలని షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో)కు చెందిన ఇతర నేతలతోపాటు ఇస్లామాబాద్‌ను సందర్శించాలని మోదీకి ఆహ్వానం పంపించింది. అయితే మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్‌ 370 రద్దుపై పాక్‌ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. 2015లో అప్పటి మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాకిస్తాన్‌లో పర్యటించారు. అదే చివరి పర్యటన. ఆ తర్వాత భారత్‌ నుంచి కేంద్రంలోని పెద్దలు ఎవరూ పాక్‌ లో పర్యటించలేదు.

జైశంకర్‌ వెళ్లే అవకాశం..
ప్రధాని మోదీకి బదులుగా సీహెచ్‌సీ సమావేశంలో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను పంపే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం బిష్కెక్‌లో జరిగిన సీహెచ్‌జీ సమావేశాలకు భారతదేశం దేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ హాజరయ్యారు. కానీ ఈసారి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఏ వివరాలు చెప్పలేమని అధికారులు తెలిపారు. ఇక ఈవెంట్‌కు వ్యక్తిగతంగా హాజరుకాలేని నాయకులు వర్చువల్‌గా పాల్గొనేందుకు అనుమతిస్తారా లేదా అనేది అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం కౌన్సిల్‌ ఆఫ్‌ హెడ్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌కు అధ్యక్షత వహిస్తున్న పాకిస్తాన్‌ అక్టోబర్‌ 15–16 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించనుంది. ఎస్‌సీఓలో భారతదేశం, పాకిస్తాన్, రష్యా, చైనా సభ్యులుగా ఉన్నాయి.