https://oktelugu.com/

Kuwait : గల్ఫ్ ఒక ఎండమావి : ఎడారి దేశంలో తెలుగోడి ఆర్తనాదాలకు కదలిన యంత్రాంగం

కువైట్ లో పడరాని పాట్లు పడుతున్నానని ఓ వ్యక్తి కొద్ది రోజుల కిందట ఓ సెల్ఫీ వీడియోలో వాపోయిన సంగతి తెలిసిందే. బతుకు తెరువు కోసం కువైట్ వచ్చానని.. ఏజెంట్ చేతిలో మోసపోయానని బాధితుడు వాపోయాడు. అక్కడ తనకు ఎదురైన ఇబ్బందులను ఆ వీడియోలో చూపించాడు

Written By:
  • Dharma
  • , Updated On : July 16, 2024 / 09:41 AM IST
    Follow us on

    Kuwait :  ఎడారి దేశాలు.. దుర్భర కఠిన పరిస్థితులకు ఆలవాలాలు.. చుట్టంతా ఎడారినే.. ఇసుక దుబ్బల్లా ఎక్కడో సూదూరాన.. ఎవరూ లేని చోట కోళ్లు, మేకలు, గొర్రెలు కాసేందుకు భారతీయులను నమ్మించి మోసం చేసి అక్కడ పడేస్తారు. అదొక నరక కూపం.. కనీసం మాట్లాడడానికి ఎవరూ ఉండరు. పైగా భయంకర ఎడారి పాములు, తేల్లు సహా విష జంతువులు.. ఏమీ లేని ఆ ఎడారిలో అష్టకష్టాలు పడుతూ ఎందరో భారతీయులు చనిపోయిన ఘటనలు ఎన్నో.. అయితే ఇప్పుడు టెక్నాలజీ వారి బాధను ప్రపంచానికి పరిచయం చేసింది. వారి ఆర్తనాదాలను వినేలా చేసింది.. ప్రజలు, ప్రభుత్వాలను కదిలించేలా చేస్తోంది. కువైట్ లో చిక్కుకున్న శివను బయటకు తీసుకొచ్చే మార్గం చూపిస్తోంది.*

    కువైట్ లో పడరాని పాట్లు పడుతున్నానని ఓ వ్యక్తి కొద్ది రోజుల కిందట ఓ సెల్ఫీ వీడియోలో వాపోయిన సంగతి తెలిసిందే. బతుకు తెరువు కోసం కువైట్ వచ్చానని.. ఏజెంట్ చేతిలో మోసపోయానని బాధితుడు వాపోయాడు. అక్కడ తనకు ఎదురైన ఇబ్బందులను ఆ వీడియోలో చూపించాడు. తనను ఎడారిలో వదిలేశారని.. అక్కడ కుక్కలు, బాతులకు ఆహారం పెట్టడమే తన పని అని చెప్పుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదని.. కనీసం తాగేందుకు నీళ్లు లేవని చెప్పుకొచ్చాడు. యజమానులు పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తపరిచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. బాధితుడిని రక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఆ మేరకు భారత విదేశాంగ శాఖతో మాట్లాడారు. కువైట్లో టిడిపి ఎన్నారై విభాగం ప్రతినిధులను సైతం అలర్ట్ చేశారు. దీంతో బాధిత వ్యక్తికి విముక్తి కలిగింది.

    నంద్యాలకు చెందిన శివ ఉపాధి కోసం ఓ ఏజెంట్ ను ఆశ్రయించాడు. కువైట్ లో మంచి పని అని చెప్పి సంబంధిత ఏజెంట్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే తీరా కువైట్ వెళ్ళాక ముందు కుదుర్చుకున్న పని కాకుండా.. ఎడారిలో బాతులు, కుక్కలకు ఆహారం వేసే పనిని అప్పగించారు. ఎప్పుడో ఒకటి రెండు రోజులకు కొంతమంది మనుషులు వచ్చి.. ఆ పనులు పురమాయించి వెళ్తుండేవారు. ఒక్కో రోజు అర్ధరాత్రి మొత్తం పని చేయించేవారు. సరైన ఆహారం, నీరు కూడా అందించేవారు కాదు. దీంతో శివ ఆపసోపాలు పడ్డాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినా వారు పెద్దగా స్పందించలేదు. అప్పుచేసి డబ్బు కట్టాం కనుక.. అక్కడే ఉండి పనిచేయాలని సూచించారు. అయితే నిలువ నీడ లేదు.. మాట్లాడేందుకు మనిషి లేడు. దీంతో శివ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది విపరీతంగా వైరల్ అయింది. చివరకు ఏపీ మంత్రి లోకేష్ దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన లోకేష్ విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చారు. కువైట్ లోని టిడిపి ఎన్నారై ప్రతినిధులతో మాట్లాడారు. దీంతో శివ ఆచూకీ దొరికింది. కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు శివను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ సందర్భంగా శివ ప్రత్యేక ప్రకటన వీడియో రూపంలో వచ్చింది.’ నా పేరు శివ. మాది రాయలసీమలోని నంద్యాల. కువైట్ కు బతకడానికి వస్తే.. ఇక్కడ బతుకే కష్టమైపోయింది. నిన్న ఎంబసీ వాళ్లు నాకు కాల్ చేశారు. వాళ్లే నన్ను ఎంబసీకి తీసుకొచ్చారు. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాను. నేను భారత్ వెళ్లే వరకు ఉండడానికి, తినడానికి ఏ ఇబ్బంది ఉండదని సార్ వాళ్ళు చెప్పారు. క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నాదే అని చెప్పారు. నన్ను కాపాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని బాధితులు శివ తెలిపారు.

    మరోవైపు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. శివ అనే కువైట్ బాధితుడు ప్రస్తుతం ఆ దేశంలోని ఇండియన్ అంబసీలో సురక్షితంగా ఉన్నాడు. త్వరలోనే అతడిని ఏపీకి రప్పిస్తాం. ఈ మేరకు శివ మాట్లాడిన వీడియోను కూడా నారా లోకేష్ పోస్ట్ చేశారు. టిడిపి కూటమి విదేశాంగ శాఖకు ఒక మంత్రిని ప్రత్యేకంగా నియమించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత, కార్మికులు, మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వెళుతుంటారు. అక్కడ సమస్యల్లో చిక్కుకుంటారు. ఆ సమయంలో ఎవరికి సంప్రదించాలో వారికి తెలియదు. ప్రభుత్వపరంగా సీఎం స్థాయి వరకు వెళితే గానీ సమస్యకు పరిష్కార మార్గం దొరకడం లేదు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించడంతో.. సమస్యలకు ఇట్టే పరిష్కార మార్గం దొరుకుతోంది. కువైట్ లో చిక్కుకున్న శివని సైతం వేగంగా తీసుకురావడానికి ఇదే దోహద పడింది. కాగా మరో రెండు రోజుల్లో శివ స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది.