India Vs Canada: భారత్‌తో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న కెనడా..!

నిజ్జర్‌ మొదటి వర్ధంతి సందర్భంగా కెనడా పార్లమెంట్‌ మంగళవారం(జూన్‌ 18న)నివాళులర్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Written By: Raj Shekar, Updated On : June 19, 2024 3:30 pm

India Vs Canada

Follow us on

India Vs Canada: ప్రశాతంగా ఉన్న భారత్‌లో చిచ్చు పెట్టాలని ఇప్పటికే దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగు దేశం చైనా తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. వీటిని భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఈ రెండు దేశాలకు మరో దేశం తోడైంది. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌కు వత్తాసు పలుకుతూ భారత్‌తో గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది.

నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్‌ నివాళి..
నిజ్జర్‌ మొదటి వర్ధంతి సందర్భంగా కెనడా పార్లమెంట్‌ మంగళవారం(జూన్‌ 18న)నివాళులర్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌(కేటీఎఫ్‌) చీఫ్‌ హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ గతేడాది జూన్‌ 18న కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిగిన కాల్పుల్లో మృతిచెందాడు. భారత్‌ విడుదల చేసిన 40 మంది తీవ్రాదుల జాబితాలో హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ పేరు కూడా ఉండడం గమనార్హం.

కెనడా తీవ్ర ఆరోపణ..
నిజ్జర్‌ను హత్య చేసిన వారిలో నలుగురు భారతీయులు కరణ్‌ బ్రార్, అమన్‌దీప్‌సింగ్, కమల్‌ ప్రీత్‌సింగ్, కరణ్‌ప్రీత్‌సింగ్‌ నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తీవ్రవాది హత్యతో భారత్‌ హస్తం ఉందని కెనడా తీవ్ర ఆరోపణ చేసింది. ఈ ఆరోపణను భారత్‌ ఖండించింది. అప్పటి నుంచి భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్‌ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పర్చుకునే అవకాశం ఉందని ట్రూడో తెలిపారు.

కెనడా పార్లమెంట్‌ నివాళిపై స్పందించిన భారత్‌..
దీనిపై భారత్‌ కూడా స్పందించింది. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ‘ఎక్స్‌’లో ఓ పోస్టు పెట్టింది. ‘ఉగ్రవాద ముప్పును ఎదుర్కొవడంలో భారత్‌ ముందంజలో ఉంది. అదీకాక, ఉగ్రవాద ముప్పు పరిష్కారానికి ప్రపంచ దేశాలో కలిసి పనిచేస్తాం. 1985లో ఎయిరిండియా విమానం 182 (కనిష్క)పై ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడి ఘటనకు జూన్‌ 23తో 39 ఏళ్లు పూర్తవుతుంది. ఈ దాడి ఘటనలో 86 మంది చిన్నారులతోపాటు 329 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిష్క ఎయిరిండియా విమానంపై చేసిన బాంబు దాడిలో మృతిచెందిన వారికి స్మారకంగా నివాళులర్పిస్తాం. జూన్‌ 23న స్టాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లేగ్రౌండ్‌లో జరిగే స్మారక కార్యక్రమంలో భారతీయులు పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలి’ అని పేర్కొంది.