India Pakistan Nuclear Tension: భారత్తో సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మన చుట్టూ ఉన్న దేశాలు మనపై కుట్రలు చేస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్, చైనా భారత్కు నిరంతర సవాలుగా మారాయి. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చైనా నుంచి సేకరించిన అధునాతన క్షిపణులు, డ్రోన్లను వాడింది .
చైనా ఆయుధ సహకారం..
పాకిస్తాన్ సైనిక బలాన్ని పెంచడంలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికి పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82 శాతం చైనా తయారీవేనని గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ సరఫరా మరింత పెరిగి, పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంటోంది.
భారత్ పై దాడికి అణు సాయం కోరిన పాక్..
తాజాగా పాకిస్తాన్ భారత్ పై దాడి చేసేందుకు మన సహాయం చేయాలని చైనాను కోరింది. అయితే ఎందుకు చైనా నిరాకరించింది. ఒక ముఖ్యమైన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా చైనా నుంచి రహస్యంగా అణు సహాయం కోరింది. ‘డ్రాప్ సైట్’ అనే పరిశోధనా సంస్థ విడుదల చేసిన ఈ నివేదికలో పాక్ జలాంతర్గామి ఆధారిత అణు స్ట్రైక్ వ్యవస్థలు, అధునాతన అణు సామర్థ్యాల కోసం అభ్యర్థన చేసినట్లు పేర్కొన్నారు. అయితే చైనా ఈ అభ్యర్థనను స్పష్టంగా తిరస్కరించింది. ప్రపంచ అణు ఆయుధ వ్యాప్తి నిరోధక నిబంధనలను కారణంగా చూపించింది. దక్షిణాసియాలో అణు అస్థిరత పెరిగే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సముద్ర అణు సామర్థ్యం కోసం..
పాకిస్తాన్ ప్రధానంగా సముద్ర ఆధారిత “సెకండ్ స్ట్రైక్” సామర్థ్యం కోసం సహాయం కోరింది. ఇది ప్రత్యర్థి తొలి దాడి చేసిన తర్వాత కూడా అణు ప్రతిస్పందన ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. భూ, గగన తల అణు ఆస్తులు ధ్వంసమైనా, గుర్తించరాని జలాంతర్గాముల ద్వారా ప్రతీకారం తీర్చుకోవడం దీని లక్ష్యం.
భారత్ కు ఇప్పటికే సామర్థ్యం..
భారత్ ఇప్పటికే ఐ ఎన్ ఎస్ అరిహంత్ వంటి న్యూక్లియర్ సబ్మెరీన్లతో ఈ రంగంలో బలమైన స్థానం సాధించింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ దశాబ్దాలుగా ఇలాంటి సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
గ్వాదర్ పోర్ట్ ఒప్పందం..
ప్రతిపాదన లీక్ అయిన పత్రాల ప్రకారం, అణు, సైనిక సహాయం బదులుగా పాకిస్థాన్ గ్వాదర్ పోర్టును చైనాకు శాశ్వత సైనిక స్థావరంగా అందజేయాలని ప్రతిపాదించింది. ఇలాంటి అభివృద్ధి అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు వ్యూహాత్మక సమతుల్యతను పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సంఘటనలు దక్షిణాసియా భద్రతా పరిస్థితులపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నాయి.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన సరిహద్దు భద్రత మరియు అణు సన్నాహాలను ఇన్నింకా బలోపేతం చేసుకోవాల్సిన తరుణం ఇది.
